Harish Rao: రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలు అమలు కాలేదు: హరీశ్ రావు

Harish Rao blames Congress for fake promises
  • టీచర్లపై లాఠీలు.. బ‌డుగుజీవుల‌కు జూటా హామీలు.. ఇదీ రేవంత్ రెడ్డి పాలన అని విమర్శ
  • నిరుద్యోగ భృతిపై ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క చేతులెత్తేశారని వ్యాఖ్య
  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతు రాకేశ్ రెడ్డికి ఓటేయాలని పిలుపు
 దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ తండ్రి కానిలాల్ నాయక్ ఇటీవల మృతి చెందారు. బీఆర్ఎస్ సీనియర్ నేత  హరీశ్ రావు దేవరకొండకు వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సంద‌ర్భంగా దేవరకొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు ప్రియాంక, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి... ఇలా ఎవరు ఇచ్చిన హామీలు అమలు కాలేదని అన్నారు. టీచర్లపై లాఠీలు.. బ‌డుగుజీవుల‌కు జూటా హామీలు.. ఇదీ రేవంత్ రెడ్డి పాలన అని విమర్శించారు.

కాంగ్రెస్ 100 రోజుల‌ హామీ అమలు కాలేదన్నారు. విద్యార్థులకు భరోసా కార్డు లేదు.. స్కూటీ ఇవ్వలేదు... నిరుద్యోగ భృతి రాలేదని మండిపడ్డారు. నిరుద్యోగ భృతిపై ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క చేతులెత్తేశారన్నారు. ఉద్యోగులకు మూడు డీఏలు అన్నారని... కానీ ఒక్క డీఏ కూడా విడుదల చేయలేదని విమర్శించారు. రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్ ఇవ్వలేదన్నారు. మెరుగైన పీఆర్సీని ఉద్యోగులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. విద్యావంతులు, నిరుద్యోగులు ఆలోచన చేసి ఓటేయాలని పిలుపునిచ్చారు. ప్రశ్నించే గొంతు రాకేశ్ రెడ్డిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలన్నారు.

కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడమంటే ఆ పార్టీ మోసాన్ని బలపరిచినట్లవుతుందని హెచ్చరించారు. ప్రైవేటు కాలేజీలకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వడం లేదన్నారు. జర్నలిస్టులకు రూ.100 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నాయని... చేతలు మాత్రం గడప దాటడం లేదని ఎద్దేవా చేశారు.
Harish Rao
Revanth Reddy
BRS
Graduate MLC Elections

More Telugu News