Gujarat: 'భూ' బకాసుర‌.. గ్రామాన్నే కొనేసిన జీఎస్‌టీ అధికారి!

Gujarat GST Commissioner Grabs 620 Acres From Entire Village In Maharashtra
  • గుజ‌రాత్‌కు చెందిన జీఎస్‌టీ చీఫ్ క‌మిష‌న‌ర్ చంద్రకాంత్ వాల్వి నిర్వాకం
  • మ‌హారాష్ట్ర ఝ‌దానీ గ్రామంలో 620 ఎక‌రాల భూమి కొనుగోలు
  • ప్ర‌భుత్వం మీ భూమిని స్వాధీనం చేసుకుందంటూ గ్రామం మొత్తాన్ని క‌బ్జా చేసిన వైనం
గుజ‌రాత్‌కు చెందిన జీఎస్‌టీ చీఫ్ క‌మిష‌న‌ర్ చంద్రకాంత్ వాల్వి భారీ భూమి కొనుగోలు వ్య‌వ‌హారం తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. ఒక‌టికాదు రెండుకాదు ఏకంగా 600 ఎకరాలకు పైగా భూమి కొనుగోలు చేయ‌డం చూసి అంద‌రూ నోరెళ్ల‌బెడుతున్నారు. మ‌హారాష్ట్ర మ‌హాబ‌లేశ్వ‌ర్ స‌మీపంలోని ఝ‌దానీ గ్రామంలో 620 ఎక‌రాల భూమిని బంధువులు, కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి కొన్నాడు. ఇలా ఝదానీ గ్రామం మొత్తాన్ని అధికారి కొనుగోలు చేయ‌డం ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

ప్ర‌భుత్వం మీ భూమిని స్వాధీనం చేసుకుంటుంద‌ని గ్రామ‌స్థుల‌ను భ‌య‌పెట్టిన‌ట్లు సామాజిక కార్య‌క‌ర్త‌ సుశాంత్ మోరే తెలిపారు. ప‌ర్యావ‌ర‌ణ‌, అట‌వీ సంర‌క్ష‌ణ చ‌ట్టాలు ఉల్లంఘించి మూడేళ్లుగా ఆ భూముల్లో నిర్మాణాలు, మైనింగ్‌ జ‌రుగుతున్నాయ‌న్నారు. అనధికార నిర్మాణాలు, తవ్వకాలు, చెట్ల నరికివేత, అక్రమ రహదారులు, అటవీ సరిహద్దు నుండి విద్యుత్ సరఫరా కారణంగా అంతర్గత ప్రాంతాల్లో పర్యావరణానికి తీవ్ర‌ నష్టం వాటిల్లుతుందని ఆయ‌న తెలిపారు.  

అయితే ఆశ్చర్యకరంగా ఈ విష‌యం ఏ ప్ర‌భుత్వ శాఖ‌కు తెలియ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో ప్రభుత్వాధికారులు ఎవరూ తనిఖీలు చేయలేదు. తాజాగా ఈ విష‌యం బ‌య‌ట‌కు రావ‌డంతో దీనిపై సతారా జిల్లా మేజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు. గ్రామ నిర్వాసితులకు పూర్తి స్థాయిలో భూమి అందజేయాల‌ని, ఈ సమస్యపై తగిన చర్యలు తీసుకోకుంటే జూన్ 10వ తేదీ నుంచి సతారా జిల్లా పరిపాలన కార్యాలయం ఎదుట నిరసన చేస్తానని సుశాంత్ మోరే తెలిపారు. 

మహాబలేశ్వర్‌ పోలీస్ అధికారి కాంబ్లే మాట్లాడుతూ, ఈ విషయమై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పేర్కొన్నారు. ఇక చంద్రకాంత్ వాల్వికి ఇంతకుముందు అనేక బోగస్ బిల్లింగ్, అక్రమ ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ సర్వీస్ కేసులలో కూడా ప్రమేయం ఉన్న‌ట్లు తెలుస్తోంది.
Gujarat
GST Commissioner
Chandrakant Valvi
Maharashtra

More Telugu News