Mangalagiri: రూ. 5 వేలకు ఓటు అమ్ముకున్న ఎస్సైపై సస్పెన్షన్ వేటు

Mangalagiri SI who sold his postal ballot vote suspended
  • పోస్టల్ బ్యాలెట్ ఓటును అమ్ముకున్న గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ స్టేషన్ ఎస్సై ఖాజాబాబు
  • బంధువుల ద్వారా ఓ నాయకుడి నుంచి డబ్బు తీసుకున్న వైనం
  • పోలీసులకు సదరు నాయకుడు పట్టుబడటంతో బండారం బట్టబయలు
  • ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినందుకు ఎస్సైని సస్పెండ్ చేసిన ఐజీ
ఐదు వేల రూపాయలకు తన పోస్టల్ బ్యాలెట్ ఓటును అమ్ముకున్న ఓ పోలీసు అధికారి చివరకు సస్పెండయ్యారు. ప్రకాశం జిల్లా కురిచేడుకు చెందిన ఖాజాబాబు గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు. మార్చిలో ఎన్నికల బదిలీల్లో భాగంగా మంగళగిరి స్టేషన్‌కు వచ్చారు. సొంతూరు కురిచేడులోనే ఆయనకు ఓటు హక్కు ఉంది. అయితే, ఖాజాబాబుతో ఓటు వేయిస్తానని ఆయన బంధువులు ఓ పార్టీ నాయకుడి నుంచి రూ.5 వేలు పుచ్చుకున్నారు. ఆ మొత్తాన్ని ఎస్సైకి ఆన్‌లైన్‌లో బదిలీ చేశారు. 

మరోవైపు, ఆ నాయకుడు ప్రకాశం జిల్లాలో డబ్బులు పంపిణీ చేస్తూ పోలీసులకు చిక్కాడు. అతడిని పోలీసులు విచారించగా ఎస్సైకి డబ్బులు ఇచ్చిన విషయం వెలుగులోకి వచ్చింది. ఖాజాబాబు డబ్బులను ఎస్సై బంధువులకు ఇచ్చినట్టు చెప్పడంతో పోలీసులు వారిని విచారించారు. అనంతరం ఎస్సైపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా ఉన్నతాధికారులు గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠీకి నివేదిక పంపారు. దీంతో, ఖాజాబాబును సస్పెండ్ చేస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. 
Mangalagiri
Guntur District
Andhra Pradesh
AP Police

More Telugu News