KTR Tweet: నాంపల్లిలో పూర్తికావొచ్చిన మల్టీ లెవల్ కార్ పార్కింగ్ పనులు.. కేటీఆర్ ట్వీట్

KTR Tweet About Multilevel Car Parking project
  • బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఈ ప్రాజెక్టు పూర్తికావొచ్చిందని హర్షం
  • అర ఎకరం స్థలంలో పదిహేను అంతస్తులలో నిర్మాణం
  • మరిన్ని ఎంఎల్ సీపీలను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచన
హైదరాబాద్ లో పార్కింగ్ సమస్యకు పరిష్కారంగా గత ప్రభుత్వం తలపెట్టిన ఆటోమేటెడ్, కంప్యూటరైజ్డ్ మల్టీ లెవల్ కార్ పార్కింగ్ (ఎంఎల్ సీపీ) కాంప్లెక్స్ నిర్మాణం దాదాపు పూర్తికావొచ్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు కాస్త ఆలస్యంగా పూర్తయిందని వివరించారు. ఎట్టకేలకు నాంపల్లిలో మల్టీ లెవల్ పార్కింగ్ అందుబాటులోకి రానుందని చెప్పారు. దీనిపై హర్షం వ్యక్తం చేసిన మాజీ మంత్రి కేటీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును మరింత ముందుకు తీసుకెళుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఎంఎల్ సీపీలను నిర్మించాలని సూచించారు. 

ఈ ప్రాజెక్టును 2016-17 ఆర్థిక సంవత్సరంలో పీపీపీ విధానంలో రూ.80 కోట్ల వ్యయంతో మొదలుపెట్టామని కేటీఆర్ తెలిపారు. నాంపల్లి మెట్రో రైల్ స్టేషన్ సమీపంలోని హెచ్ఎంఆర్ కు చెందిన అర ఎకరం స్థలంలో 15 అంతస్తులలో నిర్మాణ పనులు ప్రారంభించినట్లు గుర్తుచేశారు. బిల్డింగ్ నిర్మాణ ఫోటోలను షేర్ చేస్తూ.. కాస్త ఆలస్యమైనప్పటికీ నిర్మాణం పూర్తికావడం సంతోషం కలిగిస్తోందని చెప్పారు. సిటీలో కీలకమైన జంక్షన్లు, మెట్రో స్టేషన్లు, వాణిజ్య కేంద్రాలలో మరిన్ని ఎంఎల్ సీపీలను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. కాగా, ఈ భవనంలో 10 అంతస్తులు వాహనాల పార్కింగ్ కు మిగతా ఐదు అంతస్తులలో కమర్షియల్ షాపులు, రెండు స్క్రీన్ లతో కూడిన థియేటర్ కూడా నిర్మిస్తున్నారు.
KTR Tweet
MLCP
Multilevel Car Parking
Nampally

More Telugu News