Vamsi: తన గోదావరి ముచ్చట తీర్చలేదు .. చివరికి అందులోనే తన అస్థికలు కలిపాను: డైరెక్టర్ వంశీ

Vamsi  Special
  • తన భార్యను జ్ఞాపకం చేసుకున్న వంశీ 
  • తనకి గోదావరి అంటే ఇష్టమని వెల్లడి 
  • ఆమెను తీసుకెళ్లడం కుదరలేదని ఆవేదన 
  • ఆమె అస్థికలు పట్టిసీమ గోదావరిలో కలిపానంటూ ఉద్వేగం   

దర్శకుడు వంశీ తన సినిమా జీవితం .. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను వీడియోస్ ద్వారా షేర్ చేసుకుంటున్నారు. రీసెంటుగా చేసిన వీడియోలో, తన భార్య 'లచ్చ' గురించి ప్రస్తావించారు. "మా పెళ్లి అయిన తరువాత చాలా చిన్న వయసులోనే నాతో పాటు మద్రాస్ వచ్చింది నా భార్య లచ్చ. గోదావరి పుష్కరాలకు పట్టిసీమ తీసుకుని వెళ్లమని అడిగింది. కొత్త సినిమా మొదలైంది .. ఇప్పుడు కుదరదని అంటే, అర్థం చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది.

శ్రీరామనవమి సమయంలో 'భద్రాచలం తీసుకుని వెళ్లమని అడిగింది. గోదావరిలో స్నానం చేసి దైవ దర్శనం చేసుకుంటానని అడిగింది. కొత్త సినిమా .. తీరికలేదని అంటూ నాకున్న పనులను గురించి చెబితే, పని ముఖ్యం కదా అంటూ సర్దుకుపోయింది. ఆ తరువాత గండిపోచమ్మ తీర్థం .. ధవళేశ్వరం స్వామి కళ్యాణం .. తాను అడిగినా, ఏదో ఒక ఇబ్బంది కారణంగా నేను తీసుకుని వెళ్లడం కుదరలేదు" అని అన్నారు. 

"నేను ఎవరితో ఏం మాట్లాడుతున్నా పట్టించుకోని నా భార్య, గోదావరి గురించి నేను మాట్లాడుతున్నప్పుడు మాత్రం పని మానేసి మరీ వింటుంది. చివరిసారిగా కూడా తాను పట్టిసీమ వెళదామని అంటే, అప్పుడు కూడా నాకున్న పని గురించి చెప్పాను. అప్పుడు మాత్రం తాను బాధపడి ఉంటుందని అనుకుంటున్నాను. 

"అక్టోబర్ 13వ తేదీన నేను ఊహించనిది ఒకటి జరిగింది. ఆ రోజు తెల్లవారు జామున నా భార్య నా చేతుల్లోనే కాలం చేసింది. రోజూలానే నిద్రపోతున్నట్టుగా ఉందే తప్ప చనిపోయినట్టుగా లేదు. పట్టిసీమ తీసుకెళ్లమంటే తీసుకెళ్లలేకపోయిన నేను, తన అస్థికలను అక్కడే కలిపాను" అంటూ ఉద్వేగానికి లోనయ్యారు వంశీ.

  • Loading...

More Telugu News