Palnadu: తమ్ముళ్లూ! నేతల స్వార్థాలకు బలికావొద్దు.. ఓ పల్నాడు వాసి ఆవేదన

Palnadu district native shocked by violent incidents urges youth not to fall prey to politics
  • పల్నాడు జిల్లాలో హింస చూసి చలించిపోయిన వ్యక్తి
  • తమ ఊరి హింసాత్మక ఘటనలు గుర్తుచేస్తూ నెట్టింట పోస్టు
  • రాజకీయ స్వార్థానికి తమ తరం బలైందని ఆవేదన
  • జీవితాలను నాశనం చేసుకోవద్దంటూ నేటి యువతకు హెచ్చరిక
ఏపీలో పోలింగ్ సందర్భంగా పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. అధికశాతం పల్నాడు జిల్లాలోనే వెలుగుచూడటం స్థానికుడు ఒకరిని కదిలించింది. ఈ ఘటనలు తన చిన్ననాటి రోజుల్ని గుర్తుకు తేవడంతో ఆ వ్యక్తి..యువతను రాజకీయ నేతల స్వార్థాలకు బలికావొద్దంటూ హెచ్చరించారు. తమ తరం ఇలాగ నాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు. తన చిన్నప్పుడు ఏం జరిగిందో చెబుతూ ఆయన ఇచ్చిన సందేశం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 

‘‘ఇప్పుడు పల్నాడు జిల్లాలో జరుగుతున్న అల్లర్లు చూస్తే మా ఊరి గతం గుర్తుకొస్తోంది. 1995-96 సమయంలో ఇంత కంటే ఎక్కువగానే జరిగాయి. మండల పరిషత్ ఎన్నికలతో మొదలైన గొడవలు చాలా రోజులు నడిచాయి. మొదట్లో వీరావేశంతో బాంబులు వేసిన వాళ్లను హీరోలుగా చూశాం. బడులు ఎగ్గొట్టి ఆడుకున్నాం. మేము తోపులం అని ఒక్కొక్కరు కథలు చెబుతుంటే అలా ఉండాలి అనిపించేది. కానీ తర్వాత గొడవలు ప్రారంభమయ్యాయి. పంతాలు పెరిగాయి. కొట్లాటలో కొంత మంది చేతులు, కాళ్లు విరిగాయి. కొంతమంది తలలు పగిలాయి. కొందరి ప్రాణాలు పోయాయి. పోలీసులు ఇళ్లల్లో సోదాలు చేసేవాళ్లు’’ 

‘‘అందరూ ఊరి చివర తోటల్లో ఉండే వాళ్లు. వాళ్లకు భోజనాలకు బాగా ఇబ్బందిగా ఉండేది. ఇళ్లల్లో ఆడవాళ్లు బాగా ఇబ్బంది పడేవాళ్లు. పశువులకు మేత తేవడం కూడా కష్టమయ్యేది. దీంతో, చాలా మంది పశువులనూ అమ్మేసుకున్నారు. పదోతరగతి పాసైనవారి నుంచి డిగ్రీ చేసిన వాళ్ల వరకూ ఈ గొడవల్లో పడి జీవితాలు నాశనం చేసుకున్నారు. మంచి ఉద్యోగాలు దొరక్క, చిన్న చిన్న ప్రైవేటు ఉద్యోగాలతో సరిపెట్టుకున్నారు. కేసులతో, వాయిదాలతో చాలా కుటుంబాలు ఆర్థికంగా ఛిన్నాభిన్నం అయ్యాయి’’
 
‘‘మనిషి ముందు హీరోలా చూసినా వెనక మాత్రం రౌడీ, దుర్మార్గుడు అనుకునే వాళ్లు. ఒక తరమంతా ఇలా నాశనమైంది. ఊరి పేరు చెబితే పెళ్లి సంబంధం కూడా వచ్చేది కాదు. ఎటుచూసినా నష్టమే. రాజకీయ నాయకుల కోసమే మన జీవితాలు నాశనం అయ్యాయి. పల్నాటి కుర్రోళ్లకు ఒకటే చెబుతున్నా. గొడవలు పడకండి. ఈ రోజు మా ఊళ్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. మీరు కొట్టుకుని నష్టపోకండి. ఇదీ మా ఊరి అనుభవం. మా ఊరు రొంపిచర్ల’’ అని రాసుకొచ్చారు.
Palnadu
Andhra Pradesh
Lok Sabha Polls
TDP-JanaSena-BJP Alliance
YSRCP

More Telugu News