Rajasthan Royals: లక్నోపై ఢిల్లీ క్యాపిటల్స్ ఉత్కంఠ విజయం.. ప్లే ఆఫ్స్‌ చేరుకున్న రాజస్థాన్ రాయల్స్

Rajasthan Royals officially qualified for Play offs as Delhi Capitals beat LSG
  • 19 పరుగుల తేడాతో గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్
  • 209 పరుగుల లక్ష్య ఛేదనలో 189 పరుగులకే పరిమితమైన లక్నో
  • విఫలమైన లక్నో టాపార్డర్
  • పూరన్, అర్షద్ ఖాన్ రాణించినా దక్కని ఫలితం
  • 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌కి అర్హత సాధించిన రాజస్థాన్
  • ఢిల్లీ ఆశలు సజీవం.. దాదాపు నిష్క్రమించిన లక్నో సూపర్ జెయింట్స్

ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఉత్కంఠభరిత విజయం సాధించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌పై 19 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్దేశించిన 209 పరుగుల లక్ష్య ఛేదనలో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు మాత్రమే చేయగలిగింది. 

భారీ లక్ష్య ఛేదనలో లక్నో టాపార్టర్ దారుణంగా విఫలమైంది. క్వింటన్ డీకాక్ (12), కేఎల్ రాహుల్ (5), మార్కస్ స్టోయినిస్ (5), దీపక్ హుడా (0) త్వరత్వరగా ఔటయ్యారు. అయితే నికోలస్ పూరన్, అర్షద్ ఖాన్ రాణించినప్పటికీ విజయతీరాలకు చేర్చలేకపోయారు. పూరన్ 27 బంతుల్లో 61 పరుగులు బాదగా.. అర్షద్ ఖాన్ 33 బంతుల్లో 58 పరుగులు రాబట్టి నాటౌట్‌గా నిలిచాడు. మిగతా బ్యాటర్లలో కృనాల్ పాండ్యా (18), చరాక్ (14), రవి బిష్ణోయ్ (2), నవీన్ హుల్ హక్ (2 నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. ఇక ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ అత్యధికంగా మూడు వికెట్లు తీశాడు. మిగతా బౌలర్లలో ఖలీల్ అహ్మద్, అక్షర్ పటేల్, ముకేశ్ కుమార్, కుల్దీప్ యాదవ్, స్టబ్స్ తలో వికెట్ తీశారు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. అభిషేక్ పోరెల్ (58), స్టబ్స్ (57) టాప్ స్కోరర్లుగా ఉన్నారు. మిగతా బ్యాటర్లు కూడా సమష్టిగా రాణించారు. లక్నో బౌలర్లలో నవీన్ హుల్ హక్ 2 వికెట్లు, అర్షద్ ఖాన్, రవి బిష్ణోయ్ చెరో వికెట్ తీశారు.

ప్లే ఆఫ్స్‌కు రాజస్థాన్ రాయల్స్ అడుగు..
లక్నో సూపర్ జెయింట్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించడంతో రాజస్థాన్ రాయల్స్ అధికారికంగా ప్లే ఆఫ్స్‌కి అర్హత సాధించింది. రాజస్థాన్ రాయల్స్ ఖాతాలో ఇప్పటికే 16 పాయింట్లు ఉండడంతో అర్హత సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ మినహా ఇతర జట్లేవీ 16 పాయింట్లు సాధించే అవకాశం లేకపోవడంతో రాజస్థాన్‌కు మార్గం సుగమం అయ్యింది. రాజస్థాన్‌కు మిగిలివున్న రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయినా ఆ జట్టుపై ఎలాంటి ప్రభావం ఉండదు. ఇక తాజా గెలుపుతో ఢిల్లీ ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండగా.. మైనస్ రన్‌రేట్ కలిగివున్న లక్నో సూపర్ జెయింట్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించింది.
Rajasthan Royals
Delhi Capitals
Lucknow Super Giants
IPL 2024

More Telugu News