Gujarat Titans: గుజరాత్, కోల్‌కతా మ్యాచ్ రద్దవడంతో మారిన సమీకరణాలు.. ఆర్సీబీకి గుడ్‌న్యూస్

What happens to IPL 2024 points table as GT vs KKR clash gets washed out
  • టాప్-2లో చోటు దక్కించుకుని క్వాలిఫయర్-1 అర్హత సాధించిన కోల్‌కతా
  • ఫ్లే ఆఫ్స్ రేసులో బెంగళూరు, ఢిల్లీ అవకాశాలు మరింత మెరుగు
  • ఉత్కంఠభరితంగా మారిన ప్లే ఆఫ్స్ స్థానాలు
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా సోమవారం జరగాల్సిన గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఐపీఎల్‌లో కనీసం టాస్ కూడా పడకుండా రద్దయిన తొలి మ్యాచ్ ఇదే కావడం విశేషం. ఐపీఎల్-2024 ప్లేఆఫ్స్ రేసులో అత్యంత కీలకమైన దశలో ఈ మ్యాచ్ రద్దు కావడంతో సమీకరణాలు మారాయి. 

మ్యాచ్ రద్దవడంతో కోల్‌కతా, గుజరాత్ జట్లకు చెరొక పాయింట్ లభించింది. ఫలితంగా ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా నైట్ రైడర్స్ మొత్తం 19 పాయింట్లతో టాప్-2లో చోటుని ఖరారు చేసుకుంది. ఇతర జట్ల గెలుపోటములతో సంబంధం లేకుండా ఆ జట్టు తొలి రెండు స్థానాల్లో నిలవడం ఖాయమైంది. తద్వారా క్వాలిఫైయర్ 1కి అర్హత సాధించింది. రాజస్థాన్ రాయల్స్ మినహా ఇతర జట్లేవీ కోల్‌కతాను మించే అవకాశం లేదు. రాజస్థాన్ అగ్రస్థానానికి చేరుకున్నా కోల్‌కతా టాప్-2 స్థానంలో నిలిచేందుకు ఎలాంటి ఢోకా ఉండదు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మిగిలివున్న రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచినా 18 పాయింట్లకే పరిమితం అవుతుంది. కాబట్టి మే 21న జరిగే క్వాలిఫైయర్ 1 మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడడం ఖాయమైంది. తద్వారా ఫైనల్‌కు చేరేందుకు కోల్‌కతాకు రెండు అవకాశాలు లభించినట్టయ్యింది.

కాగా వర్షం కారణంగా మ్యాచ్ రద్దవడం గుజరాత్ టైటాన్స్ ఆశలపై నీళ్లు చల్లింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఆ జట్టు అధికారికంగా నిష్ర్కమించింది. ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు ఖాతాలో 11 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. మిగిలివున్న మ్యాచ్‌లో గెలిచినా ఆ జట్టు ఖాతాలో 13 పాయింట్లే ఉంటాయి. కాబట్టి ప్లే ఆఫ్స్ చేరేందుకు దారులు మూసుకుపోయాయి. ప్రస్తుత సమీకరణాల ప్రకారం 14 లేదా అంతకంటే ఎక్కువ పాయింట్లు ఉన్న జట్లుకే ప్లే ఆఫ్స్ చేరే అవకాశం కనిపిస్తోంది.

ఆర్సీబీ, ఢిల్లీకి మెరుగైన అవకాశాలు
ప్లే ఆఫ్స్ రేసు నుంచి గుజరాత్ టైటాన్స్ నిష్ర్కమించడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు ఒకింత గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. బెంగళూరు, ఢిల్లీ, లక్నో జట్లు ప్రస్తుతం తలో 12 పాయింట్లు, చెన్నై 14 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు పోటీ పడుతుండగా గుజరాత్ నిష్ర్కమణతో ఈ జట్ల అవకాశాలు మెరుగయ్యాయి. ఒకవేళ చెన్నై మిగిలివున్న మ్యాచ్‌లో ఓడిపోతే ఆ జట్టు ఖాతాలో 14 పాయింట్లు ఉంటాయి. మరోవైపు సన్‌రైజర్స్ కూడా మిగిలివున్న రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోతే ఆ జట్టు ఖాతాలోనూ 14 పాయింట్లే ఉంటాయి. ఈ సమీకరణంలో బెంగళూరు, ఢిల్లీ తమ చివరి మ్యాచ్‌ల్లో గెలిస్తే 14 పాయింట్లతో ప్లే ఆఫ్స్ బెర్తులు రసవత్తరంగా మారతాయడంలో ఎలాంటి సందేహం లేదు.

కాగా ఒక కోణంలో చూస్తే గుజరాత్, కోల్‌కతా మ్యాచ్ రద్దవడం రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌లకు అంతమంచి పరిణామం కాదు. ఎందుకంటే ఈ మ్యాచ్ రద్దవ్వకుంటే రాజస్థాన్, హైదరాబాద్ జట్లు టాప్-2లో నిలిచే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు రాజస్థాన్‌కు మాత్రమే ఈ ఛాన్స్ ఉంది.
Gujarat Titans
Kolkata Knight Riders
IPL 2024
Royal Challengers Bengaluru
Cricket

More Telugu News