Annabathuni Sivakumar: తెనాలి ఎమ్మెల్యేను చెంపదెబ్బ కొట్టడంపై ఓటరు సుధాకర్ వివరణ

Gottimukkala Sudhakar explains what happened with Tenali MLA Annabathuni Sivakumar
  • ఏపీలో ఇవాళ పోలింగ్
  • తెనాలిలో ఓ పోలింగ్ బూత్ వద్ద ఘటన
  • ఓ ఓటరుపై చేయి చేసుకున్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్
  • తిరిగి ఎమ్మెల్యే చెంపచెళ్లుమనిపించిన ఓటరు

తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఇవాళ ఓ ఓటరు చేతిలో చెంపదెబ్బ తినడం తెలిసిందే. తెనాలి పోలింగ్ బూత్ లో జరిగిన పరిణామాల నేపథ్యంలో, తొలుత ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఓటరుపై చేయిచేసుకోగా, తిరిగి ఆ ఓటరు ఎమ్మెల్యే చెంపచెళ్లుమనిపించారు. ఈ గొడవపై ఎమ్మెల్యే అన్నాబత్తుని ఇప్పటికే తన వివరణ ఇచ్చారు. తాజాగా, ఓటరు గొట్టిముక్కల సుధాకర్ కూడా చెంపదెబ్బ అంశంపై తన వివరణను వినిపించారు. 

"నేను ఇవాళ ఉదయం 7.05 గంటలకు ఓటేసేందుకు పోలింగ్ బూత్ వద్ద క్యూలో నిలబడ్డాను. ఆ సమయంలో ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి ఓటేసేందుకు వచ్చారు. క్యూలో నిలబడి లోపలికి వెళ్లాలని నేను ఎమ్మెల్యే పక్కన ఉన్న వ్యక్తులకు చెప్పాను. వారు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. 

నేను క్యూలైన్లో రమ్మని చెప్పడంతో ఎమ్మెల్యే వాళ్లకు కోపం వచ్చింది. ఓటేసి బయటికి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే కుమారుడు దురుసుగా మాట్లాడాడు. తన అనుచరులతో మాట్లాడి విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నా వద్దకు వచ్చి ఎవడ్రా నువ్వు? అంటూ నన్ను కొట్టాడు. 

కొట్టాలని నేనేమీ ప్లాన్ తో రాలేదు. అప్పటికప్పుడు కలిగిన ఆవేశంతో ఎమ్మెల్యేను తిరిగి కొట్టాను. దాంతో ఏడెనిమిది మంది వ్యక్తులు నన్ను కిందపడేసి ఇష్టం వచ్చినట్టు కొట్టారు. వాళ్లెవరో తెలియదు కానీ, చూస్తే గుర్తుపడతాను. 

నేను మద్యం తాగి ఉన్నానని ఎమ్మెల్యే చేస్తున్న ఆరోపణల్లో నిజంలేదు. నేను మద్యం తాగి ఐదారునెలలైంది. ఇవాళ నేను మద్యం తాగి ఉంటే నా బ్లడ్ శాంపిల్స్ తీసుకుని పరీక్షించుకోవచ్చు. 

అంతేకాదు, నేను అసభ్యంగా దూషించినట్టు చెబుతున్నారు... కావాలంటే పోలింగ్ బూత్ లో సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన ఫుటేజీని చూసుకోవచ్చు. నేను ఎవరినీ ఒక్క మాట కూడా దూషించలేదు. క్యూలైన్లో నిలబడి ఓటేయండి అని మాత్రమే అన్నాను.  

నేను ఒక సామాన్య పౌరుడ్ని. మాకు రక్షణ కల్పించాల్సిన ఎమ్మెల్యేనే "చంపుతాం" అని బెదిరించడం పద్ధతి కాదు" అని సుధాకర్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News