NDA: ఓటు వేయని వారంతా సాయంత్రం 6లోగా పోలింగ్ బూత్‌ల వద్దకు చేరుకోవాలి... వైసీపీ కుట్రలు భగ్నం చేయాలి: కూటమి నేతలు

Alliance leaders calls for voters to cast their vote
  • కూటమి నేతల మీడియా సమావేశం
  • ప్రజలను బూత్ ల వద్దకు రానివ్వకుండా చేయాలని వైసీపీ కుట్రలు చేస్తోందన్న నేతలు
  • ఆ కుట్రలను ప్రజలే  తిప్పికొట్టాలన్న షరీఫ్, లంకా దినకర్ 

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్డీఏ కూటమి నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో టీడీపీ నేత ఎంఏ షరీఫ్ మాట్లాడుతూ.. వైసీపీకి గుడ్ బై చెప్పి ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో ప్రభంజనం సృష్టించడానికి ప్రజలు సిద్ధమైపోయారని వెల్లడించారు. ప్రజల్లో వచ్చిన ఈ మార్పు తిరుగుబాటుకు నిదర్శనంగా కనిపిస్తోందని అన్నారు. ప్రజల ఉత్సాహం, పోలింగ్ జరుగుతున్న సరళి చూసి వైసీపీ నాయకుల వెన్నులో వణుకు మొదలైందని, అందుకే అల్లరి మూకలు దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. 

"ప్రజాస్వామ్య బద్దంగా జరగాల్సిన ఎన్నికలను సైతం హైజాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని హరిస్తూ ఎవరైనా తమ కాళ్ల కిందే ఉండాలనేలా వ్యవహరిస్తున్నారు. 

పోలింగ్ కేంద్రాల వద్ద భయానక పరిస్థితులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న వైసీపీ నేతల్ని నిలువరించాలి. పోలింగ్ కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది. ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎక్కడెక్కడి నుండో వచ్చిన ఓటర్లను భయబ్రాంతులకు గురి చేసేలా జగన్ రెడ్డి ముఠా వ్యవహరించడం దుర్మార్గం. సాయంత్రం 6 గంటల్లోపు ప్రతి ఒక్కరూ పోలింగ్ బూత్ వద్దకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలి" అని పిలుపునిచ్చారు

బీజేపీ అధికార ప్రతినిధి, లంకా దినకర్ మాట్లాడుతూ... "రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి మరీ కూటమిని గెలిపించుకోవాలని ముందుకు వచ్చారు. ఎంతో ఉత్సాహంతో యువత, మహిళలు వచ్చారు. మధ్యాహ్నానికే ఏకంగా 60 శాతం వరకు పోలింగ్ పూర్తవడంతో.. నైరాశ్యంతో ఓటర్లను చెల్లాచెదురు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 

ధర్మవరంలో సత్యకుమార్ యాదవ్‌ను ఓడించే లక్ష్యంతో రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. విజయవాడ పశ్చిమలో వైసీపీ అభ్యర్ధి ఏకంగా పోలీసులపై వీరంగం సృష్టించారు. గుంటూరులో బీజేపీ నేత సునీల్‌పై ఎమ్మెల్సీ అప్పిరెడ్డి దాడికి పాల్పడ్డారు. రాజమండ్రిలో పోలింగ్ బూత్ ల వద్ద బ్లేడ్ బ్యాచ్‌ని రంగంలోకి దింపాడు. తాడిపత్రిలో ఎస్పీ వాహనంపై ఎమ్మెల్యే పెద్దారెడ్డి    తెగబడ్డాడు. తెనాలిలో ఓటరుపై ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ దాడికి పాల్పడ్డాడు. 

ముఖ్యమంత్రి పేషీలో ఓఎస్డీగా ఉన్న ధనుంజయ్ రెడ్డి వైసీపీ నేతలకు మేలు చేసేలా వ్యవహరించాలంటూ కలెక్టర్లకు సూచనలిస్తున్నాడు. సాయంత్రం 6 లోగా ఓటర్లంతా బూత్ వద్దకు చేరుకోవాలి. జగన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా, అరాచకాలకు పాల్పడినా రాష్ట్ర భవిష్యత్తు కోసం కదలి రావాలి. ఉదయం నుండి చూపిస్తున్న ఉత్సాహాన్ని మరో రెండు గంటల పాటు కొనసాగించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం" అని అన్నారు

జనసేన అధికార ప్రతినిధి, ప్రొ.కె.కె.దశరథ్ మాట్లాడుతూ.. "ప్రజాస్వామ్యం ప్రజలకు కల్పించిన ఓటు హక్కును హరించేలా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. ఓటమి ఫిక్స్ అయిపోయిందనే అసహనంతో దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. ఓటరుపై తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ దాడి చేయడం హేయం. జగన్ రెడ్డి అరాచకాల పట్ల ప్రజలు ఎంతలా విసిగిపోయారో పోలింగ్ బూత్ ల వద్ద బారులు తీరిన ప్రజలే నిదర్శనం. సాయంత్రం 6 లోగా పోలింగ్ బూత్ ల వద్దకు చేరుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి" అని పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News