Arvind Kejriwal: ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ ను తొలగించాలన్న పిటిషన్ డిస్మిస్

supreme court rejects plea seeking removal of kejriwal as delhi chief minister
  • పిటిషనర్ వాదనను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
  • ఆరోపణలు ఉన్నంత మాత్రాన ఒక సీఎంను తొలగించే హక్కు ఏమీ లేదని వ్యాఖ్య
  • అవసరమైతే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ స్పందిస్తారని వెల్లడి

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఆ పదవి నుంచి తొలగించాలంటూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో ఆరోపణలపై ఆయన్ను సీబీఐ, ఈడీ అరెస్టు చేసినందున సీఎం పదవిలో ఉండే హక్కు లేదంటూ ఈ పిటిషన్ దాఖలైంది. అయితే ఆరోపణలు ఉన్నంత మాత్రాన ఒక సీఎంను తొలగించే చట్టపరమైన హక్కు ఏదీ లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోదలచుకోలేదని స్పష్టం చేసింది. ఒకవేళ అవసరమైతే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా స్పందించొచ్చని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది. 

సుప్రీంకోర్టు గత వారం కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేయడం తెలిసిందే. లోక్ సభ ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి వీలుగా జూన్ ఒకటో తేదీ వరకు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే సీఎంగా మాత్రం ఎలాంటి అధికారిక కార్యకలాపాలు చేపట్టరాదని షరతు విధించింది. జూన్ 2న తిరిగి లొంగిపోవాలని ఆదేశించింది.

ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాంలో ఆయన పాత్ర ఉందంటూ కేజ్రీవాల్ ను ఈడీ మార్చి 21న అరెస్టు చేసింది. ఇదే కేసులో బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కూడా ఈడీ అరెస్టు చేయడం తెలిసిందే.

  • Loading...

More Telugu News