Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణ నా తల్లిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.. నా దుస్తులు విప్పించాడు: సిట్ ఎదుట బాధిత మహిళ వాంగ్మూలం

 Prajwal Revanna Raped my mother made me strip Woman To SIT
  • నాలుగైదేళ్ల క్రితం ప్రజ్వల్, ఆయన తండ్రి తన తల్లిపై అత్యాచారానికి పాల్పడ్డారన్న మహిళ
  • వీడియో కాల్‌లో బెదిరించి తనను నగ్నంగా మార్చారని ఆవేదన
  • తనకు సహకరించకుంటే తన తండ్రిని ఉద్యోగం నుంచి తీసేస్తాని బెదిరించి తన తల్లిపై లైంగికదాడికి పాల్పడ్డారన్న బాధిత మహిళ
  • ప్రస్తుతం జైలులో ఉన్న హెచ్‌డీ రేవణ్ణ.. విదేశాల్లో ఉన్న ప్రజ్వల్‌పై బ్లూకార్నర్ నోటీసు 
జేడీఎస్ బహిష్కృత నేత, వందలాదిమంది మహిళలపై లైంగిక దాడికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ, ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణపై ఓ మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. ప్రజ్వల్ నాలుగైదేళ్ల క్రితం బెంగళూరులోని ఆయన నివాసంలో తన తల్లిపై అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆరోపించింది. ప్రజ్వల్ కేసును దర్యాప్తు చేస్తున్న సెట్‌ ఎదుట హాజరైన ఆమె తన ఆరోపణలకు సంబంధించి వాంగ్మూలం ఇచ్చింది.

2020-2021 మధ్య ప్రజ్వల్ తనతో వీడియో కాల్‌లో మాట్లాడుతూ తన దుస్తులు విప్పించారని ఆమె తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. తను చెప్పినట్టు చేయకుంటే తనకు, తన తల్లికి హాని తలపెడతానని హెచ్చరించి తనను నగ్నంగా మార్చాడని ఆవేదన వ్యక్తం చేసింది. 

‘‘అతడు (ప్రజ్వల్ రేవణ్ణ) నా తల్లి ఫోన్‌కు వీడియో కాల్ చేసి నాతో మాట్లాడేవాడు. దుస్తులు తొలగించాలని బలవంతం చేసేవాడు. నిరాకరిస్తే నాకు, మా అమ్మకు హాని తలపెడతానని హెచ్చరించేవాడు. ఈ విషయం తెలిసినా మా కుటుంబం మాకు అండగా నిలిచింది’’ అని బాధితురాలు పేర్కొంది. ‘‘నా తల్లిపై ప్రజ్వల్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆయన తండ్రి కూడా మా అమ్మను వదల్లేదు. ఇద్దరూ కలిసి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డారు’’ అని బాధితురాలు వాపోయింది. 

తనకు సహకరించాలని ప్రజ్వల్ తన తల్లిని బెదిరించేవాడని, లేదంటే ఆమె భర్తను ఉద్యోగం నుంచి తీసేస్తానని బెదిరిస్తూ తన తల్లిపైనా, తనపైనా అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించింది. ఈ ఘటనపై తాము ఫిర్యాదు చేశాక తన తండ్రిని ఉద్యోగం నుంచి తొలగించారని వాపోయింది. నిరంతర వేధింపులతో తన కుటుంబం భారీగా నష్టపోయిందని, ఫోన్ నంబర్లు మార్చాలని కూడా తమపై ఒత్తిడి తీసుకొచ్చారని ఆమె తన వాంగ్మూలంలో పేర్కొంది. ప్రజ్వల్ తన ఇంట్లో పనిచేసే మహిళలపైనా లైంగిక దాడులకు పాల్పడ్డాడని ఆమె ఆరోపించారు. 

ఇదే కేసులో అరెస్ట్ అయిన హెచ్‌డీ రేవణ్ణ ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఈ నెల 14 వరకు కోర్టు ఆయనకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. సోమవారం ప్రజాప్రతినిధుల కోర్టులో ఆయన బెయిలు పిటిషన్‌పై వాదనలు జరగనున్నాయి. మరోవైపు, ఆరోపణలు వెలుగులోకి వచ్చిన వెంటనే విదేశాలకు పారిపోయిన ప్రజ్వల్‌పై బ్లూకార్నర్ నోటీసు జారీ అయింది.
Prajwal Revanna
Karnataka
JDS
HD Revanna
Sex Scandal

More Telugu News