NASA: సూర్యుడి ఉపరితలంపై భారీ విస్పోటనాలు.. ఎగసిపడ్డ సౌర జ్వాలలు

Massive Explosions On Sun That Unleashed Solar Flares
  • మే 10, 11 తేదీల్లో సూర్యుడి ఉపరితలంపై పేలుళ్లు
  • సౌర తుఫానుగా భూమిని తాకిన విద్యుదయస్కాంత క్షేత్రాలు
  • విస్పోటనాల ఫోటోలను షేర్ చేసిన నాసా
సూర్యుడి ఉపరితలంపై శుక్ర, శనివారాల్లో శక్తిమంతమైన రెండు విస్పోటనాలు సంభవించాయి. దీంతో పెద్ద ఎత్తున సౌర జ్వాలలు ఎగసిపడ్డాయి. ఈ విద్యుదయస్కాంత క్షేత్రాల అలలు ‘సౌర తుఫాను’గా భూమిని తాకాయి. కాగా సూర్యుడిపై సంభవించిన విస్పోటనాలను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు చెందిన ‘సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ’ కెమెరాతో బంధించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఎక్స్ వేదికగా నాసా షేర్ చేసింది. ‘‘మే 10-11 తేదీల్లో సూర్యుడి నుంచి రెండు శక్తిమంతమైన సౌర జ్వాలలు వెలువడ్డాయి. మే 10న అమెరికా కాలమానం ప్రకారం రాత్రి 9:23 గంటలకు, మే 11న ఉదయం 7:44 గంటలకు విస్పోటనాలు సంభవించాయి. ఎక్స్5.8, ఎక్స్1.5- తీవ్రత గల జ్వాలలుగా గుర్తించాం. నాసాకు చెందిన సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ ఈ దృశ్యాలను బంధించింది’’ అని నాసా వివరించింది.

కాగా సూర్యుడిపై విస్పోటనాల కారణంగా గత రెండు దశాబ్దాలకు పైగా కాలంలో అత్యంత శక్తిమంతమైన సౌర తుపాను శుక్రవారం భూమిని తాకిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఖగోళ కాంతి ఆకాశంలో కనిపించింది. టస్మానియా నుంచి బ్రిటన్ వరకు ప్రజలు ఈ కాంతిని వీక్షించారు. ఉపగ్రహాలు, పవర్ గ్రిడ్‌లలో అంతరాయాలు ఏర్పడే ముప్పు ఉందని అమెరికా వాతావరణ అంచనా సంస్థ నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్‌వోఏఏ) హెచ్చరించింది. సీఎంఈలుగా (కరోనల్ మాస్ ఎజెక్షన్స్) పిలిచే సూర్యుడి ఉద్గారాలైన అయస్కాంత క్షేత్రాలు, ప్లాస్మాలు లండన్ కాలమానం (జీఎంటీ) ప్రకారం శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో భూమిని తాకాయని వివరించింది.

కాగా ఈ సౌర తుపానుకు సంబంధించి ఉత్తర యూరప్, ఆస్ట్రేలియాలలో ఏర్పడిన ‘అరోరా’లకు సంబంధించిన ఫొటోలను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎలాంటి పరికరాలు లేకుండా దీనిని చూడగలిగామని పలువురు పేర్కొన్నారు.
NASA
Explosions On Sun
Solar Flares
Solar Storm

More Telugu News