Pawan Kalyan: దేశం విడిచి వెళ్లాలంటే కోర్టు అనుమతి కోరే వ్యక్తి మనకు ముఖ్యమంత్రి: పవన్ కల్యాణ్

Pawan Kalyan comments on CM Jagan in Kakinada
  • కాకినాడలో వారాహి విజయభేరి సభ
  • కాకినాడ పార్లమెంటు స్థానానికి ఈ ఎన్నికలు చాలా కీలకమైనవన్న పవన్
  • మీ భవిష్యత్ మీ చేతుల్లోనే ఉందని వెల్లడి
  • నాకే కాదు మీక్కూడా కోపం వస్తేనే వైసీపీ గద్దె దిగుతుందని స్పష్టీకరణ

జనసేనాని పవన్ కల్యాణ్ కాకినాడలో ఈ సాయంత్రం భారీ బహిరంగ సభకు నిర్వహించారు. ఈ వారాహి విజయభేరి సభలో ఆయన ప్రసంగిస్తూ, ఈ ఎన్నికలు కాకినాడ పార్లమెంటు స్థానానికి చాలా కీలకమైనవని అన్నారు. కాకినాడ ఇవాళ మద్యానికి, గంజాయికి, బియ్యం స్మగ్లింగ్ కు, డీజిల్ అక్రమ రవాణాకు, అమ్మాయిలపై అఘాయిత్యాలకు, బ్లేడ్ బ్యాచ్ లకు అడ్డాగా మారిందని వివరించారు. 

2014లో పార్టీ పెట్టినా పోటీ చేయలేదని, 2019లో రెండు చోట్ల ఓడిపోయినా నిలబడే ఉన్నానని, పార్టీని విజయవంతంగా ముందుకు నడిపించానని పేర్కొన్నారు. మన ముఖ్యమంత్రి దేశం దాటి వెళ్లాలంటే కోర్టుకు వెళ్లి అనుమతి తీసుకోవాలని, అలాంటి వ్యక్తి మన ముఖ్యమంత్రిగా ఉన్నాడని పవన్ కల్యాణ్ ఎద్దేవా చేశారు. 

మే 13న రాష్ట్రంలో పోలింగ్ జరగనుంది... మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది... ఈ ఎన్నికల్లో మీరు భవిష్యత్ కోసం ఓటేయండి... రాష్ట్రాన్ని కాపాడండి అని పిలుపునిచ్చారు. ఉమ్మడి గోదావరి జిల్లాలో ఎక్కడికి వెళ్లినా ఎమ్మెల్యే ద్వారంపూడి పాదముద్రలు కనిపిస్తున్నాయని, ప్రతి చోటా గంజాయి మాఫియా మొదలుపెట్టాడని, ఈ ప్రాంతాన్ని అక్రమాలకు కేంద్రంగా మార్చాడని మండిపడ్డారు. 

మనం భగత్ సింగ్ ను ఆరాధిస్తాం, చే గువేరాను అభిమానిస్తాం... అలాంటి మనం ఒక రౌడీ ఎమ్మెల్యేకు భయపడతామా? భయం వదిలేయండి... ధైర్యంగా ముందుకు రండి అని పిలుపునిచ్చారు. మనకు క్షణక్షణానికి మారిపోయే వ్యక్తులు కాదు, సుస్థిరంగా నిలబడే వ్యక్తులు కావాలి... ఊసరవెల్లి లాంటి చలమలశెట్టి సునీల్ వంటి వ్యక్తులను కాకినాడ పార్లమెంటులో గెలిపించకూడదన్నారు.

గాంధీకి, భగత్ సింగ్ కు మాలలు వేసి, వైసీపీ గూండా ప్రభుత్వానికి ఓటు వేస్తాం అంటే మన సమాజాన్ని మనమే నాశనం చేసుకుంటున్నట్టు లెక్క అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. కాకినాడ నుంచి ద్వారంపూడి వంటి చెంచాగాళ్లను పంపించేద్దాం అని వ్యాఖ్యానించారు. 

"నా నేలను, నా దేశాన్ని కాపాడుకోవాలనేదే నా తపన. అందుకే నేను రాజకీయాల్లోకి వచ్చాను. రాజకీయాల్లోకి వచ్చి అందరితో పచ్చి బూతులు అనిపించుకోవాల్సిన అవసరం లేదు నాకు... కానీ ప్రజల కోసం అన్నీ భరిస్తున్నాను. నేను ఓటు అడుగుతోంది నా కోసం కాదు, మీ భవిష్యత్ కోసం మీరు ఓటేయండి అని అడుగుతున్నాను. 

నేను ఏదో ఒక పదవి కోరుకునేవాడ్ని అయితే, ప్రధాని మోదీతో నాకున్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని ఏదో ఒక పదవి తీసుకునేవాడ్ని. కానీ నేను పదవులు ముఖ్యమని భావించలేదు. ఎంతసేపూ కోపం నా ఒక్కడికే రావాలా? మీక్కూడా కోపం వస్తేనే సమాజంలో మార్పు వస్తుంది, వైసీపీ గద్దె దిగుతుంది. ఈసారి పరిస్థితి స్పష్టంగా ఉంది. వైసీపీ ప్రభుత్వం మళ్లీ రావడంలేదు, జగన్ మళ్లీ సీఎం కావడంలేదు. 

30 వేల మంది ఆడపిల్లలు ఆంధ్రప్రదేశ్ నుంచి అదృశ్యమైతే ఈ ముఖ్యమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నీకున్న చెంచాలంతా ద్వారంపూడి వంటివాళ్లయితే ఆడపిల్లల భద్రతపై బాధ్యత నీకెందుకుంటుంది? 

ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటున్నారు... మన భూమి సరిహద్దు రాళ్లపై, మన పాస్ పుస్తకాలపై జగన్ ఫొటో ఉంటుంది. దేశం విడిచి వెళ్లాలంటే కోర్టు అనుమతి తీసుకునే నేరస్తుడు ఫొటో మన పాస్ పుస్తకాలపై, హద్దు రాళ్లపై ఉంటోంది. 30కి పైగా కేసులున్న అతడు మనకు ముఖ్యమంత్రి. ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడంటే తప్పెవరిది? మనదే. ద్వారంపూడి వంటి వాళ్లకు ఎందుకు భయపడతారు? ఒక్క మహిళ తిరగబడితే చాలు... ఎక్కడుంటారు ఇలాంటి వాళ్లు?" అంటూ పవన్ ధ్వజమెత్తారు.

  • Loading...

More Telugu News