KCR: తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్‌వి అబద్ధాలు... ఏ ముఖ్యమంత్రీ అలా చెప్పరు: కేసీఆర్

KCR faults congress government about telangana economic situation
  • కాంగ్రెస్ చిల్లర రాజకీయాల కోసం అమూల్యమైన సమయాన్ని వృథా చేసిందని విమర్శ
  • నాలుగైదు నెలల కాలంలోనే కాంగ్రెస్ పార్టీపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్న కేసీఆర్
  • కాంగ్రెస్ సరూర్ నగర్ సభకు మూడువేల మంది కూడా రాలేదన్న మాజీ సీఎం
తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ అవాస్తవాలు చెబుతోందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. రాష్ట్రం దివాలా తీసిందని ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పరన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ చిల్లర రాజకీయాల కోసం అమూల్యమైన సమయాన్ని వృథా చేసిందని విమర్శించారు. నాలుగైదు నెలల కాలంలోనే ప్రజలు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. రాష్ట్రాభివృద్ధిపై కాంగ్రెస్ తక్కువ దృష్టి పెట్టిందన్నారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన కొత్తలో కరెంట్ కోతలు బాగా ఉండేవన్నారు. కానీ తమ ప్రభుత్వం వచ్చిన 4 నెలల్లో విద్యుత్ కోతలను పరిష్కరించామన్నారు.

కాంగ్రెస్ సరూర్ నగర్ సభకు కనీసం 3 వేలమంది ప్రజలు కూడా హాజరు కాలేదన్నారు. కాంగ్రెస్ సభల్లో ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలు తప్పడం లేదన్నారు. విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. హైదరాబాద్‌ను తాము పవర్ ఐలాండ్‌గా మార్చామన్నారు. కాంగ్రెస్ పాలనలో పరిశ్రమలు అన్నీ తరలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పక్కకు జరగగానే కరెంట్ కష్టాలు ఎందుకు ప్రారంభమయ్యాయని ప్రశ్నించారు. కష్టపడి బతికే కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందన్నారు.

పంద్రాగస్ట్ లోగా రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారని... కానీ ఏ సంవత్సరం ఆగస్టో చెప్పాలని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులే లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీని కాటేస్తాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్నంత జోష్ కాంగ్రెస్ నేతల్లో ఇప్పుడు లేదన్నారు. చేనేత కార్మికులను ఆదుకోవడానికి బతుకమ్మ చీరల ఆర్డర్ ఇచ్చామన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వారి బకాయిలు కూడా చెల్లించడం లేదన్నారు. తాను చేనేత కార్మికుల కోసం ఏదో వ్యంగ్యంగా మాట్లాడితే తన గొంతును 48 గంటలు బంద్ చేశారన్నారు. బీఆర్ఎస్ హయాంలో కరెంట్ పోతే వార్త అన్నట్లుగా ఉండేదన్నారు. వరికి బోనస్ మొత్తాన్ని ఇవ్వడం లేదన్నారు.
KCR
Congress
Revanth Reddy
Telangana
Lok Sabha Polls

More Telugu News