Colin Munro: అంత‌ర్జాతీయ క్రికెట్‌కు కివీస్ స్టార్ క్రికెట‌ర్ గుడ్ బై!

New Zealand Batsman Colin Munro Announces Retirement From International Cricket
  • న్యూజిలాండ్ క్రికెట‌ర్ కొలిన్ మున్రో అంత‌ర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్
  • 2024 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో కివీస్ జ‌ట్టులో చోటు ద‌క్క‌క‌పోవ‌డంతో ఈ నిర్ణ‌యం 
  • అన్ని ఫార్మాట్ల నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌ట‌న‌
  • న్యూజిలాండ్‌ త‌ర‌ఫున 65 టీ20లు, 57 వ‌న్డేలు, ఒక టెస్టులో ప్రాతినిధ్యం వ‌హించిన మున్రో
న్యూజిలాండ్ స్టార్ క్రికెట‌ర్ కొలిన్ మున్రో అంత‌ర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. 2024 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో కివీస్ జ‌ట్టులో చోటు ద‌క్క‌క‌పోవ‌డంతో అత‌డు ఈ నిర్ణ‌యం తీసుకున్నాడు. ఈ నేప‌థ్యంలోనే అన్ని ఫార్మాట్ల నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు తెలిపాడు. చివ‌రిసారిగా 2020లో భార‌త్‌పై టీ20 సిరీస్ ఆడిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట‌ర్ ఆ త‌ర్వాత న్యూజిలాండ్ జ‌ట్టుకు పూర్తిగా దూర‌మ‌య్యాడు. 

కాగా, మున్రో కివీస్ త‌ర‌ఫున 65 టీ20లు, 57 వ‌న్డేలు, ఒక టెస్టుకు ప్రాతినిధ్యం వ‌హించాడు. అన్ని ఫార్మాట్ల‌లో క‌లిపి 3000 ప‌రుగులు చేశాడు. టీ20ల్లో ఈ స్టార్ బ్యాట‌ర్ ఏకంగా 3 శ‌త‌కాలు బాద‌డం గ‌మ‌నార్హం. అలాగే ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌లు లీగ్‌ల‌లో 20కి పైగా జ‌ట్ల‌కు మున్రో ప్రాతినిధ్యం వ‌హించ‌డం విశేషం. ఇటు ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) లో కూడా 13 మ్యాచులు ఆడాడు. 

"నేను చివరిసారిగా నా టీ20 జ‌ట్టు త‌ర‌ఫున‌ కనిపించి చాలా కాలం అయిన‌ప్ప‌టికీ, నా ఫామ్‌ దృష్ట్యా తిరిగి జ‌ట్టులో చోటు పొందగలననే ఆశను నేను ఎప్పుడూ వదులుకోలేదు. కానీ, టీ20 ప్రపంచ కప్ కోసం బ్లాక్‌క్యాప్స్ జట్టును ప్రకటించిన త‌ర్వాత నా క్రికెట్ అధ్యాయానికి ముగింపు ప‌ల‌క‌డానికి ఇదే సరైన సమయం అని అనిపించింది" అని కొలిన్ మున్రో త‌న వీడ్కోలు ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నాడు.
Colin Munro
New Zealand
Retirement
International Cricket
Sports News

More Telugu News