TCS: కళ్లు చెదిరే వార్షిక వేతనం అందుకున్న టీసీఎస్ కొత్త సీఈవో

  • కొత్తగా నియమితులైన కృతివాసన్ వార్షిక వేతనం రూ.25.36 కోట్లు
  • సీవోవో ఎన్‌జీ సుబ్రమణ్యం 2023-24 ఏడాది జీతం రూ.26.18 కోట్లు
  • ఆర్థిక సంవత్సరం 2024 వార్షిక నివేదికలో కీలక వివరాలు వెల్లడించిన కంపెనీ
newly appointed chief executive officer and managing director of TCS K Krithivasan pay is 25 crore rupees

టీసీఎస్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా (సీఈవో), మేనేజింగ్ డైరెక్టర్‌గా (ఎండీ) నియమితులైన కేకే కృతివాసన్ ఆర్థిక సంవత్సరం 2024కిగానూ రూ.25 కోట్లకు పైగా వేతనాన్ని అందుకున్నారని కంపెనీ గురువారం ప్రకటించింది. కృతివాసన్ జీతంగా రూ.1.27 కోట్లు పొందారని, రూ.3.08 కోట్ల మేర ప్రయోజనాలు, పారితోషికాలు, అలవెన్సులు పొందారని, ఇక కమీషన్‌గా రూ.21 కోట్లు పొందారని వార్షిక నివేదికలో పేర్కొంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ సహా వేర్వేరు సర్వీసులు అందిస్తున్న టీసీఎస్‌కు గ్లోబల్ హెడ్‌గా ఆయన ఈ భారీ మొత్తాన్ని ఆర్జించారని వివరించింది. ఇటీవలే రాజేశ్ గోపీనాథన్ కంపెనీ నుంచి నిష్క్రమించడంతో ఆ స్థానంలో కృతివాసన్ బాధ్యతలు స్వీకరించారు. ఐదేళ్లపాటు ఆయన పదవిలో కొనసాగనున్నారు.

ఇక టీసీఎస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) ఎన్‌జీ సుబ్రమణ్యం ఆర్థిక సంవత్సరం 2023-24లో ఏకంగా రూ.26.18 కోట్ల మొత్తాన్ని జీతంగా సంపాదించారని వార్షిక రిపోర్టులో కంపెనీ పేర్కొంది. త్వరలోనే పదవీ విరమణ చేయనున్న ఆయన వేతనంగా రూ.1.72 కోట్లు, ప్రయోజనాలు, పారితోషికాలు, అలవెన్సుల రూపంలో రూ.3.45 కోట్లు, కమీషన్‌గా రూ.21 కోట్లు ఆర్జించారని వివరించింది. సీవోవో వార్షిక వేతనం 8.2 శాతం పెరిగిందని పేర్కొంది. హోదాలో మార్పు కారణంగా కృతివాసన్ జీతాన్ని సుబ్రమణ్యం వేతనంతో పోల్చలేమని వివరించింది.

మార్చి 31, 2024 నాటికి కంపెనీలోని మధ్యస్థ వేతనంగా ఉన్న రూ.6,01,546 తో పోల్చితే సీవోవో వేతనం 346.2 రెట్లు అధికమని టీసీఎస్ పేర్కొంది. కంపెనీలో సగటు వార్షిక పెరుగుదల 5.5-8 శాతం శ్రేణిలో ఉంటుందని, అత్యుత్తమంగా రాణించే ఉద్యోగులకు రెండంకెల ఇంక్రిమెంట్లు అందిస్తున్నామని పేర్కొంది. ఇక ఆర్థిక సంవత్సరం 2023-24 చివరి నాటికి కంపెనీ ఉద్యోగుల్లో 35.6 శాతం మహిళలు ఉన్నారని కంపెనీ తెలిపింది. కంపెనీ ఉద్యోగుల్లో దాదాపు 55 శాతం మంది వారంలోని అన్ని పని దినాలు ఆఫీసు నుంచి వర్క్ చేస్తున్నారని వెల్లడించింది. సీఈఓగా రెండు నెలలపాటు సేవలు అందించిన గోపీనాథన్  వేతనంగా రూ.33.6 లక్షలు, ప్రయోజనాలు, పారితోషికాల రూపంలో రూ.76.8 లక్షలు పొందారని వివరించింది.

అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితుల కారణంగా మార్కెట్‌లో ఒకింత అనిశ్చితి నెలకొందని టీసీఎస్ పేర్కొంది. వృద్ధిపై ప్రభావం చూపవచ్చునని విశ్లేషించింది. ఇక అంతక్రితం ఏడాదితో పోల్చితే ఆర్థిక సంవత్సరం 2024లో కంపెనీ రాబడి 17.6 శాతం నుంచి 6.8 శాతానికి తగ్గిందని వివరించింది. ఇక ఆల్-టైమ్ హై ఆర్డర్ బుక్, నిరంతరం కొనసాగుతున్న ఒప్పందాలు, ప్రణాళికలు కంపెనీ వృద్ధి వేగాన్ని పెంచుతాయని వార్షిక నివేదికలో కృతివాసన్  విశ్వాసం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News