NDA Leaders: రాష్ట్రం సర్వనాశనం.. జగన్‌పై మూకుమ్మడిగా విరుచుకుపడిన కూటమి నేతలు

  • రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాశాడన్న విషయం జగన్‌కు ఇటీవలే తెలిసిందన్న వర్ల రామయ్య ఎద్దేవా
  • వికేంద్రీకరణ పేరుతో రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను జగన్ సర్వనాశనం చేశారన్న బేజేపీ నేత లంకా దినకర్
  • ప్రజలు తమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జగన్‌కు ఎన్నికల్లో బుద్ధిచెప్పాలన్న జనసేన నాయకుడు శివశంకర్
  • అప్పుడు ప్రతిపక్షంలో, ఇప్పుడు అధికారంలో ఉండి అమరావతిపై జగన్ విషం చిమ్ముతున్నారన్న యామినీ శర్మ
NDA Leaders Fires On Jagan In Press Meet

అమరావతిని సర్వనాశనం చేసేందుకు కంకణం కట్టుకున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అంటూ టీడీపీ నేత వర్ల రామయ్య విరుచుకుపడ్డారు. అమరావతికి దాపురించిన దరిద్రం మన ముఖ్యమంత్రి అని నిప్పులు చెరిగారు. మూడు రాజుధానుల పేరుతో కుప్పిగంతులు వేశారని మండిపడ్డారు. ఎన్డీయే కూటమి నేతల ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పెద్దగా చదువుకోకపోవడం వల్ల, రాజకీయాల పట్ల, చట్టాల పట్ల అవగాహన లేకపోవడం వల్ల ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మన రాజ్యాంగాన్ని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన సంగతి కూడా ఆయనకు ఇటీవలే తెలిసిందని ఎద్దేవా చేశారు. హైకోర్టు మొట్టికాయలు వేసిన తర్వాతే మనకు రాజ్యాంగం ఉందన్న విషయం జగన్‌కు తెలిసిందని అన్నారు.

బీజేపీ నాయకుడు లంకా దినకర్ మాట్లాడుతూ.. వికేంద్రీకరణ పేరుతో జగన్ మూడు ప్రాంతాలను సర్వనాశనం చేశారని విమర్శించారు. అమరావతిని మాత్రమే కాకుండా ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమలో అభివృద్ధి అనేదే లేకుండా చేశారని తూర్పారబట్టారు. జగన్ పాలనలో అభివృద్ది తిరోగమనంలో ఉంటే అవినీతి అంబరాన్ని అంటిందని, అరాచకం రాష్ట్రవ్యాప్తమైందని, విధ్వంసం విపరీతమైందని ఆరోపించారు. పెట్టుబడులు అనేవే లేకుండా పోయాయని మండిపడ్డారు. అస్మదీయులకు భూములు కట్టబెట్టారని ఆరోపించారు. విశాఖ కార్యనిర్వాహక రాజధాని అని, కర్నూలు హైకోర్టు అని చెప్పి ఆ తర్వాత సుప్రీంకోర్టు అఫిడవిట్‌లో మాత్రం అలాంటిదేమీ లేదని చెప్పి ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలను జగన్ మోసం చేశారని పేర్కొన్నారు.

జనసేన నాయకుడు శివశంకర్ మాట్లాడుతూ.. రాజధాని చుట్టూ జగన్ రాజకీయాలు ఎలా చేశారన్న విషయాన్ని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. రాష్ట్రాన్ని రక్షించాల్సిన, రాష్ట్ర ప్రజల సమగ్ర శ్రేయస్సును కాపాడాల్సిన ముఖ్యమంత్రి దుర్మార్గాలకు ఒడిగడుతున్నారని మండిపడ్డారు. ప్రజలు తమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉంటూ ఓటు వేయాలని కోరారు.

బీజేపీ నాయకురాలు యామినీ శర్మ మాట్లాడుతూ.. ప్రజాపోరాటం ఏదైనా ఉందీ అంటే అది అమరావతి మహిళా రైతులు చేసిందేనని పేర్కొన్నారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా అమరావతిపై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. అభివృద్ధిపై ఆయనకు విజన్ లేకపోవడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News