Arvind Kejriwal: ఢిల్లీ-రాజస్థాన్ మ్యాచ్‌లో కేజ్రీవాల్‌కు అనుకూలంగా నినాదాలు.. పోలీసుల నిర్బంధం.. వీడియో ఇదిగో!

APP Supporters Rise Slogans In Delhi Stadium During IPL Match
  • కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ స్టేడియంలో నినాదాలు
  • జైల్లో పెట్టినందుకు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక
  • పబ్లిక్ న్యూసెన్స్ చేస్తున్నారంటూ అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఐపీఎల్‌లో భాగంగా గత రాత్రి ఢిల్లీ కేపిటల్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్‌ మద్దతుదారులు స్టేడియంలో నినాదాలతో హోరెత్తించారు. అయితే, స్టాండ్స్‌లో న్యూసెన్స్ చేస్తున్నారంటూ పోలీసులు వారిని నిర్బంధించారు. 

ఆప్ మద్దతుదారులు స్టాండ్స్‌లో కేజ్రీవాల్‌కు మద్దతుగా నినాదాలు చేస్తున్న వీడియోను ఆప్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. కేజ్రీవాల్ కటకటాల వెనక ఉన్నట్టున్న ఫొటోతో కూడిన టీషర్ట్ ధరించిన వారంతా కేజ్రీవాల్‌ అనుకూల నినాదాలు చేయడంతోపాటు ‘భారత్ మాతా కీ జై’ అంటూ నినదించారు. అలాగే, ‘జైల్ కా జవాబ్ ఓట్ సే’ అంటూ పెద్ద ఎత్తున నినదించారు. 

స్టేడియంలో కేజ్రీవాల్ అనుకూల నినాదాలు చేసింది ఆప్ విద్యార్థి విభాగం ‘చాత్రా యువ సంఘర్ష్ సమితి (సీవైఎస్ఎస్) అని పార్టీ తెలిపింది. వీరంతా కేజ్రీవాల్ అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారని పేర్కొంది. కాగా, స్టేడియంలో పబ్లిక్ న్యూసెన్స్ చేస్తున్న వారిని నిర్బంధించినట్టు పోలీసులు తెలిపారు. చట్టపరమైన ఫార్మాలిటీ తర్వాత వారిని విడిచిపెట్టినట్టు పేర్కొన్నారు.
Arvind Kejriwal
Delhi Stadium
Viral Videos
AAP Supporters

More Telugu News