Air India: మూకుమ్మడిగా సెలవు పెట్టిన సిబ్బంది.. చిక్కుల్లో ఎయిర్ ఇండియా

70 Air India Express flights cancelled as staff take mass sick leave
  • మంగళవారం రాత్రి నుంచి ఒక్కొక్కరుగా సిక్ లీవ్ పెట్టిన పైలట్లు, క్యాబిన్ క్రూ
  • పలు విమానాలు ఆలస్యం.. 70కి పైగా సర్వీసులను రద్దు చేసిన సంస్థ
  • ఎయిర్ పోర్టుల్లో ప్రయాణికుల అవస్థలు.. ఎయిర్ ఇండియా క్షమాపణలు
ఎయిర్ ఇండియా సిబ్బంది మూకుమ్మడిగా సెలవు పెట్టారు.. చివరి క్షణంలో సిక్ అయ్యామంటూ లీవ్ పెట్టడంతో పలు సర్వీసులు నిలిచిపోయాయి. ప్రత్యామ్నాయం లేకపోవడంతో దాదాపు 70 కి పైగా సర్వీసులను ఎయిర్ ఇండియా రద్దు చేసింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు దేశంలోని వివిధ సిటీల మధ్య తిరగాల్సిన విమానలను రద్దు చేసింది. దీంతో ఎయిర్ పోర్టుల్లో ప్రయాణికులు తీవ్ర అవస్థలకు గురయ్యారు. సిబ్బంది చివరినిమిషంలో సెలవు పెట్టడంతో విమానాలను నడపడం వీలుపడలేదని, అసౌకర్యానికి క్షమించాలని ఎయిర్ ఇండియా ప్రయాణికులను కోరింది. ఉద్యోగుల మూకుమ్మడి సెలవుల వెనకున్న కారణం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.

మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం దాకా వివిధ నగరాలలో ఎయిర్ ఇండియా విమానాలు రద్దయ్యాయి. విదేశాలకు వెళ్లాల్సిన పలు విమానాలు కూడా గాల్లోకి ఎగరలేదని సమాచారం. దీనిపై ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి స్పందిస్తూ.. సిబ్బంది మూకుమ్మడిగా లీవ్ పెట్టడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని వివరించారు. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని, టికెట్ట డబ్బులు పూర్తిగా వాపస్ ఇస్తున్నామని చెప్పారు. ప్రయాణాన్ని పోస్ట్ పోన్ చేసుకునేందుకు అంగీకరించిన ప్రయాణికులకు మరో తేదీకి టికెట్ ఇష్యూ చేస్తున్నట్లు వివరించారు. కాగా, సిబ్బంది సెలవుల కారణంగా బుధవారం కూడా పలు సర్వీసులపై ప్రభావం పడే అవకాశం ఉందని, ఎయిర్ పోర్టుకు బయలుదేరే ముందే ఒకసారి ఫ్లైట్ పరిస్థితి గురించి తమ వెబ్ సైట్ లో చెక్ చేసుకోవాలని సూచించారు.

ఆమధ్య ఎయిర్ ఇండియా సంస్థ తిరిగి టాటాల చేతుల్లోకి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే, యాజమాన్యానికి, ఉద్యోగులకు మధ్య పలు అంశాలపై వివాదం నడుస్తోందని సమాచారం. ముఖ్యంగా లేఓవర్ సందర్భంగా హోటల్ రూమ్ షేర్ చేసుకోవాల్సిందేనన్న యాజమాన్య ఆదేశాలపై సిబ్బంది గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు పలు ఇతర సమస్యలను ప్రస్తావిస్తూ ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ (ఏఐఎక్స్ఈయూ) ఇటీవల కేంద్ర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు లేఖ రాసింది. దీంతో కేంద్ర కార్మిక శాఖ ఎయిర్ ఇండియాకు షోకాజ్ నోటీసు పంపించింది.
Air India
70 flights cancelled
Cabin Crew
Mass Leave
Sick Leave

More Telugu News