T20 World Cup 2024: టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ కోసం భార‌త్, పాక్‌ కొత్త జెర్సీలు.. నెట్టింట న‌వ్వులు పూయిస్తున్న మీమ్స్!

Funny Memes Go Viral After India and Pakistan Unveil Respective Jersey for T20 World Cup 2024
  • జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్ దేశాల్లో టీ20 వరల్డ్ కప్
  • ఇటీవలే టీమిండియా ఆటగాళ్ల ఎంపిక
  • తాజాగా భార‌త్, పాక్‌ జ‌ట్ల‌ కొత్త జెర్సీల‌ విడుద‌ల‌
  • జెర్సీ డిజైన్‌పై మీమ్స్‌తో ఆడుకుంటున్న నెటిజ‌న్లు
జూన్ 1వ తారీఖు నుంచి ప్రారంభం కానున్న టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ కోసం ఇప్ప‌టికే ఐసీసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అమెరికా, వెస్టిండీస్ ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నీలో ఈసారి 20 జ‌ట్లు పాల్గొంటున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ఆయా జ‌ట్లు ప్ర‌పంచ‌క‌ప్‌లో పాల్గొనే త‌మ 15 మంది స‌భ్యుల‌తో కూడిన స్క్వాడ్‌ల‌ను కూడా ప్ర‌క‌టించాయి.  ఇప్పుడు ఈ పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌లో త‌మ జ‌ట్టు ఆట‌గాళ్లు ధ‌రించే కొత్త జెర్సీల‌ను విడుద‌ల చేసే ప‌నిలో ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా భార‌త్‌తో పాటు పాకిస్థాన్ జ‌ట్టు కూడా త‌మ కొత్త జెర్సీల‌ను విడుద‌ల చేశాయి. అయితే, ఈ జెర్సీలు అభిమానుల‌కు అంత‌గా న‌చ్చ‌లేదు. దాంతో నెట్టింట వీటిపై మీమ్స్ రూపంలో త‌మ వ్య‌తిరేక‌త‌ను తెలియ‌జేస్తున్నారు. 

టీమిండియా జెర్సీ బ్లూ, ఆరెంజ్ రంగుల్లో ఉంది. భుజాలు, చేతులపై కాషాయ రంగు, వాటిపై తెల్లని చారలు, మిగతా అంతా బ్లూ కలర్ లో ఈ జెర్సీ ఉంది. దీనిపై ఇప్పుడు సోష‌ల్ మీడియా వేదిక‌గా నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. 'ఇన్‌స్పైర్డ్ బై హార్పిక్ టాయిలెట్ క్లీన‌ర్' అంటూ ఒక‌రు కామెంట్ చేశారు. ఇంకా కొంత ఖ‌ర్చు చేసి బీసీసీఐ మంచి డిజైన‌ర్‌ను సెలెక్ట్ చేసుకుంటే బాగుండేద‌ని నెటిజ‌న్ రాసుకొచ్చారు. 

మ‌రోక‌రు ఇండియ‌న్ ఆయిల్ పెట్రోల్ బంక్ సిబ్బంది డ్రెస్‌తో పోల్చారు. జీపీఎల్ అనే ప్రోగ్రామ్‌లో జెతాలాల్ జెర్సీని కాపీ చేశార‌ని ఇంకోకరు కామెంట్ చేశారు. కాగా, ఇంత‌కుముందు ఇదే మాదిరి జెర్సీనే 2019 వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో భార‌త ఆట‌గాళ్లు ధ‌రించ‌డం గ‌మ‌నార్హం. 

అటు ఆకుప‌చ్చ రంగులో ఉన్న పాకిస్థాన్ జెర్సీపై నెటిజ‌న్లు సెటైర్లు వేస్తున్నారు. పాక్ జెర్సీ ఇన్‌స్పైర్డ్ బై హార్పిక్ ఫ్రెష్‌ టాయిలెట్ క్లీన‌ర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇలా ఇరుజ‌ట్ల‌పై త‌మ‌దైన శైలిలో నెటిజ‌న్లు క్రియేట్ చేసిన‌ మీమ్స్ ఇప్పుడు నెట్టింట న‌వ్వులు పూయిస్తున్నాయి.
T20 World Cup 2024
Team India
Jersey
Pakistan
Cricket
Sports News

More Telugu News