PM Modi: అప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు బీజేడీ.. ఒడిశాను దోచుకున్నాయన్న మోదీ

First Congress Loot Then BJD Loot PM Modi Rare Jab At Naveen Patnaik
  • వనరులు ఉన్నా అభివృద్ధిలో రాష్ట్రం వెనకబడిందని వ్యాఖ్య
  • బెహ్రాంపూర్ లో ప్రధాని ఎన్నికల ప్రచారం
  • రాష్ట్రంలో ఫ్రెండ్లీ ఫైట్ అంటూనే బీజేడీ చీఫ్ పై విమర్శలు
‘ఒడిశాలో సహజ వనరులకు కొదవలేదు.. అయినా రాష్ట్రం మాత్రం వెనకబడి ఉందంటే కారణం కాంగ్రెస్, బీజేడీ ప్రభుత్వాలే’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. నాడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుంటే, నేడు బీజేడీ కూడా అదే పని చేస్తోందని మోదీ మండిపడ్డారు. రాష్ట్రంలోని సహజ వనరులను కొల్లగొడుతున్నారని ఆరోపించారు. 

పుష్కలంగా నీళ్లు, సారవంతమైన భూములు, విస్తారమైన తీర ప్రాంతం, ఘనమైన చరిత్ర, సంస్కృతి.. ఇలా ఒడిశాకు దేవుడు అన్నీ ఇచ్చాడు కానీ ఇక్కడి పాలకుల తీరు వల్ల రాష్ట్రం ఇప్పటికీ వెనుకబడే ఉందని విమర్శించారు. బిజు జనతా దల్ (బీజేడీ) నేతల అవినీతి, అక్రమాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. బీజేడీకి చెందిన చోటామోటా లీడర్ కూడా పెద్ద పెద్ద బంగళాలు కట్టుకున్నారని మోదీ ఆరోపించారు.

తమకు, బీజేడీకి మధ్య ఒడిశాలో ఫ్రెండ్లీ ఫైట్ మాత్రమే ఉంటుందని బీజేపీ నేతలు గతంలో చాలాసార్లు చెప్పారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకూ బీజేడీ చీఫ్, సీఎం నవీన్ పట్నాయక్ పై బీజేపీ తీవ్ర ఆరోపణలు చేయలేదు. ఆ పార్టీ నేతలు కూడా సంయమనం పాటించారు. దీనికి విరుద్ధంగా ప్రధాని మోదీ సోమవారం పట్నాయక్ పై తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం గంజాంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని చాలా ఆసుపత్రులలో డాక్టర్ పోస్టులు ఖాళీగా ఎందుకు ఉన్నాయని, వైద్యుల నియామకం ఎందుకు జరగలేదని ప్రశ్నించారు. చిన్నారులు మధ్యలోనే చదువుకు దూరమయ్యే పరిస్థితి ఎందుకు నెలకొందని నిలదీశారు.

దీనికి కారణం అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర బడ్జెట్ లో నిధులు కేటాయించకపోవడమేనని విమర్శించారు. గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒడిశాను చిన్నచూపు చూసిందని, మన్మోహన్ సర్కారు పదేళ్లలో ఒడిశాకు కేవలం రూ.1 లక్ష కోట్లు మాత్రమే ఇచ్చారని మోదీ ఆరోపించారు. అదే పదేళ్ల ఎన్డీయే హయాంలో కేంద్ర బడ్జెట్ లో ఒడిశాకు రూ.3.5 లక్షల కోట్లు కేటాయింపులు జరిగాయని వివరించారు. నిరుపేద మహిళలు గర్భం దాల్చిన సమయంలో కేంద్ర సర్కారు రూ.6 వేలు ఆర్థిక సాయం చేసేందుకు ప్రవేశ పెట్టిన స్కీమ్ ను బీజేడీ సర్కారు రద్దు చేసిందని మోదీ ఆరోపించారు. కాగా, సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఒడిశాలోని 147 అసెంబ్లీ స్థానాలు, 21 లోక్ సభ నియోజకవర్గాల్లో మే 13 నుంచి మొత్తం నాలుగు దశల్లో పోలింగ్ జరగనుంది.
PM Modi
Naveen Patnaik
Odisha
Lok Sabha Polls
Election Campaign
BJP
Bjd

More Telugu News