Getup Srinu: పిఠాపురం వార్: మంత్రి రోజా వ్యాఖ్యలపై గెటప్ శ్రీను స్పందన

Getup Srinu reacts on minister Roja remarks
  • పిఠాపురం అసెంబ్లీ బరిలో పవన్ కల్యాణ్
  • పవన్ కు మద్దతుగా జబర్దస్త్ టీమ్ ప్రచారం
  • వాళ్లెంతండీ... వాళ్ల ప్రాణమెంత? అంటూ రోజా వ్యాఖ్యలు
  • మెగా ఫ్యామిలీ అంటే భయంతో ప్రచారానికి వచ్చారని వెల్లడి
  • తాము స్వచ్ఛందంగా ప్రచారానికి వచ్చామన్న గెటప్ శ్రీను

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి బరిలో ఉన్నారు. ఆయనకు మద్దతుగా పిఠాపురం నియోజకవర్గంలో గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్, రాంప్రసాద్, హైపర్ ఆది తదితరులు ప్రచారం చేస్తున్నారు. 

అయితే వీరు నిజంగా ప్రేమతో ప్రచారం చేయడంలేదని, మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇండస్ట్రీలో లేకుండా చేస్తారన్న భయంతోనే ప్రచారం చేస్తున్నారని మంత్రి రోజా వ్యాఖ్యానించారు. వీళ్లెంతండీ... వీళ్ల ప్రాణమెంత? వీళ్లను అనడం వల్ల ఉపయోగం లేదు.... వీళ్లతో మాట్లాడిస్తున్న వారిని అనాలి... వీళ్లు చిన్న కార్యక్రమాలు చేసుకుంటూ, చిన్న రోల్స్ పోషించేవాళ్లు అంటూ రోజా పేర్కొన్నారు. 

మంత్రి రోజా వ్యాఖ్యలపై గెటప్ శ్రీను స్పందించారు. తాము పవన్ తరఫున స్వచ్ఛందంగా ప్రచారం చేస్తున్నామని స్పష్టం చేశారు. తామే స్వయంగా ఫోన్ చేసి ప్రచారం చేస్తామని చెప్పామని, అంతేతప్ప తమను ఎవరూ రమ్మని అడగలేదని వివరించారు. పవన్ కల్యాణ్ పై అభిమానం ఉంది కాబట్టే జనసేన తరఫున ప్రచారం చేస్తున్నామని వెల్లడించారు. 

పిఠాపురంలో పవన్ కు విశేష స్పందన లభిస్తోందని, ఆయనకు లక్ష మెజారిటీ ఖాయమని గెటప్ శ్రీను చెప్పారు. అలాగే, తనకు అందరు హీరోల చిత్రాల్లోనూ అవకాశాలు వస్తున్నాయని, మెగా హీరోలే కాకుండా వెంకటేశ్, నాని, ఎన్టీఆర్ ల చిత్రాల్లోనూ నటించానని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News