Nara Brahmani: ప్రచారంలో నారా బ్రాహ్మణి దూకుడు.. మంగళగిరి ఎకో పార్క్‌లో వాకర్స్‌తో మాటామంతీ

  • పార్క్ నిర్వహణకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందలేదన్న వాకర్స్
  • అధికారంలోకి వచ్చాక కేబీఆర్ పార్క్‌‌లా తీర్చిదిద్దుతామని హామీ
  • మత్స్యకారుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటామన్న బ్రాహ్మణి
Nara Brahmani Wife Of Lokesh Campaigning In Mangalagiri

తన భర్త, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ భార్య నారా బ్రాహ్మణి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచారంలో భాగంగా ఈ ఉదయం మంగళగిరి ఎయిమ్స్ ఆవరణలోని ఎకో పార్క్‌ను సందర్శించారు. వాకర్స్‌తో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా వారు తమ సమస్యలు ఏకరవు పెట్టుకున్నారు. పార్క్ నిర్వహణకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందడం లేదని, పార్క్ ప్రవేశ రుసుము రద్దు చేయాలని, ట్రాక్‌లు నిర్మించాలని, మంగళగిరిలో వాకర్స్  సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు స్థలం కేటాయించి షెడ్డు నిర్మించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన బ్రాహ్మణి అధికారంలోకి రాగానే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎకో పార్క్‌ను మరో కేబీఆర్ పార్క్ లా తీర్చిదిద్దుతామని తెలిపారు.

మత్స్యకారులను అన్ని విధాలా ఆదుకుంటామని, వారికి సంక్షేమం అందేలా చర్యలు తీసుకుంటామని నారా బ్రాహ్మణి భరోసా ఇచ్చారు. ఉండవల్లి కరకట్ట దగ్గర కృష్ణానదిలో చేపలు పట్టి అమ్మకం సాగించే మత్స్యకారులతో ఆమె మాట్లాడారు. వారి సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు హయాంలో చేపలు పట్టుకునేందుకు రెండెకరాల స్థలం ఇచ్చారని గడిచిన ఐదేళ్లలో కనీసం ఇక్కడ మార్కెట్ కూడా ఏర్పాటు చేయలేదని మత్స్యకారులు వాపోయారు. కరోనా సమయంలో ప్రభుత్వం ఆదుకోకపోవడంతో తిండి లేక అల్లాడుతున్న 4 వేల మందికి నారా లోకేశ్ భోజనం పెట్టి, నిత్యావసర వస్తువులు అందించారని గుర్తుచేసుకున్నారు.

 ఇళ్ల స్థలాలు కేటాయించాలని, చేపల మార్కెట్ ఏర్పాటు చేయాలని, వేట లేని సమయంలో ఉపాధి కల్పించాలని, తమ బిడ్డలు పెళ్లిళ్లు చేసుకోవడానికి కల్యాణ మండపం కట్టించాలని మత్స్యకారులు బ్రాహ్మణిని కోరారు. అధికారంలోకి రాగానే హామీలన్నీ నెరవేరుస్తామని, ఉచితంగా ఇంటి స్థలాలతో పాటు కమ్యూనిటీ హాల్ కట్టించి ఇస్తామని తెలిపారు. మత్స్యకారుల సంక్షేమానికి చంద్రబాబు అనేక పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేశారని, రాబోయే రోజుల్లో మరింత సంక్షేమం అందేలా చర్యలు తీసుకుంటారని బ్రాహ్మణి భరోసా ఇచ్చారు.

  • Loading...

More Telugu News