Pawan Kalyan: అవనిగడ్డలో సీఎం జగన్ పై నిప్పులు చెరిగిన పవన్

  • కృష్ణా జిల్లా అవనిగడ్డలో వారాహి విజయభేరి 
  • వాడీవేడిగా ప్రసంగించిన పవన్
  • అంబటి రాయుడు, బాలశౌరి వంటి వ్యక్తులు వైసీపీ నుంచి వచ్చేశారని వెల్లడి
  • వాళ్లు ఎందుకు వచ్చేశారో అందరూ ఆలోచించాలని పిలుపు
  • ఏం తప్పు చేశామని జగన్ కు, వైసీపీ ఎమ్మెల్యేలకు భయపడాలి? అంటూ ఆగ్రహం
Pawan Kalyn fires in CM Jagan in Avanigadda

కృష్ణా జిల్లా అవనిగడ్డలో నిర్వహించిన వారాహి విజయభేరి సభలో జనసేనాని పవన్ కల్యాణ్ వాడీవేడిగా ప్రసంగించారు. మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలశౌరి, క్రికెటర్ అంబటి రాయుడు ఇద్దరూ వైసీపీ నుంచి బయటికి వచ్చేసిన వాళ్లేనని, వారు నిజంగా జగన్ ను నమ్మారని, అలాంటి వాళ్లే వైసీపీని వదిలి వచ్చేశారంటే అందరూ ఆలోచించాలని అన్నారు. 

బాలశౌరి గతంలో వైఎస్ వద్ద పనిచేసిన వ్యక్తి అని, తండ్రిని నమ్మిన వ్యక్తి కొడుకును కూడా నమ్మారని, రాయుడు కూడా అంతేనని... వారు చెప్పే దాన్ని బట్టి వైసీపీలో వ్యక్తులు అవసరం లేదు, వారికి బానిసలు మాత్రమే అవసరం అని పవన్ పేర్కొన్నారు. వారి మోచేతి అంబలి తాగాలి, అలాంటి బానిసత్వం చేసినవారే ఆ పార్టీలో ఎమ్మెల్యేలు అవుతారు... అంటూ విమర్శించారు. 

మనం మనుషులం... రాజ్యాంగం మనకు హక్కులు కల్పించింది... కానీ ఈ వైసీపీ ఆత్మగౌరవం తీసేస్తోందని అన్నారు.  

"కార్యకర్తల కోసం నిలబడే వ్యక్తి బాలశౌరి. ఒక కార్యకర్త మీద వైసీపీ వాళ్లు చేయి చేసుకుంటే వీర సింగంలా తిరగబడ్డాడు. కార్యకర్తలకు, జనసైనికులకు బలం ఇచ్చాడు. అలాంటి నాయకుడ్ని బందరు పార్లమెంటు నుంచి బరిలో దింపాను. 

ఇక కొనకళ్ల నారాయణ గారు... రాష్ట్ర విభజన సమయంలో ఒక సింహంలా పోరాడిన వ్యక్తి. నాడు కాంగ్రెస్ నేతలపై పార్లమెంటులో తొడకొట్టి మరీ పోరాడారు. ఆయనపై దాడి జరిగితే కదిలిపోయాను. నాడు జరిగిన దాడి కొనకళ్ల మీద కాదు, టీడీపీ మీద కాదు... ఆంధ్రుల మీద జరిగింది. 

కొనకళ్ల అంటే నాకు అపారమైన గౌరవం. ఆయనంటే ఎనలేని వాత్సల్యం. అందుకే ఆయనతో చెప్పాను... సార్, మీమీద పడిన దెబ్బ మా అందరి మీద పడిన దెబ్బ, తెలుగుజాతి మీద పడిన దెబ్బ అని చెప్పాను. కొనకళ్ల ఇవాళ పెద్ద మనసుతో ఎంపీ టికెట్ ను బాలశౌరికి ఇచ్చేందుకు అంగీకరించారు. జన్మలో దీన్ని మర్చిపోలేం.

కృష్ణా జిల్లా పింగళి వెంకయ్య వంటి మహనీయుడు పుట్టిన నేల. రౌడీ ప్రభుత్వాలు, రౌడీ ఎమ్మెల్యేలు బెదిరిస్తుంటే మేం బెదిరిపోం. తప్పులు చేస్తే తాట తీస్తాం, వెర్రిమొర్రి వేషాలేస్తే పీక నులిమి రోడ్ల మీద కూర్చోబెడతాం. ఈ సమాజంలో ధైర్యం చచ్చిపోయిందనుకుంటున్నారా? ప్రజలను పిరికితనం ఆవహించిందనుకుంటున్నారా? ఆఫ్ట్రాల్ మీరెంత, మీ బతుకులెంత? 

గుండె బలం ఉంది మాకు... ఎవరిని బెదిరిస్తారు? దమ్ము ధైర్యం లేకపోతే బతకలేని ఈ సమాజంలో జగన్ ఎంత, జగన్ బతుకెంత? ఏం తప్పు చేశామని జగన్ కు, జగన్ ఎమ్మెల్యేలకు భయపడాలి? రాజ్యాంగం అందరికీ హక్కులు కల్పించలేదా? ముఖ్యమంత్రి అయినంత మాత్రాన మన బతుకులు నలిపేస్తాడా? 

చొక్కా విప్పడం కాదు, ఇది సరిపోదు... ఓట్లేయించు... ప్రభుత్వాన్ని మార్చు, రౌడీయిజాన్ని ఎదుర్కో, గూండాగిరీని కాలితో నలిపేయ్... అప్పుడు చొక్కా విప్పు (ఓ యువకుడ్ని ఉద్దేశించి). అదీ దమ్ము, అదీ తెగింపు... దివిసీమ పౌరుషం ఏంటో చూపించండి.  

మాతృభాష మాధుర్యం అర్ధం చేసుకోలేని వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. మేం ఇంగ్లీషు మీడియంతో పాటు తెలుగు మీడియం కూడా కొనసాగించాలని కోరితే, మేం ఇంగ్లీషు రద్దు చేయమన్నామని వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. వైసీపీ నాయకులకు జ్ఞానం ఉంటే మేం అన్న మాటల్లో తేడా అర్థమవుతుంది. వైసీపీ నేతలకు తెలుగు అంటే బూతులు తిట్టడం... మాకు తెలుగు అంటే ఆత్మ ఉత్తేజం పెంచడం. 

ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి. మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా జనసేన నుంచి బాలశౌరి పోటీ చేస్తున్నారు... ఆయన బ్యాలెట్ నెంబరు 6... గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి బాలశౌరిని గెలిపించండి. అవనిగడ్డ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా మండలి బుద్ధ ప్రసాద్ పోటీ చేస్తున్నారు. ఆయన బ్యాలెట్ నెంబరు 6... గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి బుద్ధ ప్రసాద్ ను గెలిపించండి" అని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News