Gautam Gambhir: నాకు నిద్రలేని రాత్రులు ఇచ్చిన ఏకైక బ్యాట్స్‌మెన్ అతడే: గౌతమ్ గంభీర్

Gautam Gambhir says there is no batter he has feared the most than Rohit Sharma
  • ఐపీఎల్‌లో రోహిత్ శర్మకు తప్ప ఇంకెవరికీ తాను భయపడలేదన్న కోల్‌కతా మెంటార్
  • రోహిత్ కోసం ముందు రోజు రాత్రి నుంచి ప్రణాళికలు సిద్దం చేసేవాడినని వెల్లడి
  • ఎంతో మంది దిగ్గజ బ్యాటర్లు ఎదురైనా రోహిత్ ఒక్కడే తన నిద్రలేని రాత్రులకు కారణమయ్యాడని వెల్లడి
  • ముంబై వర్సెస్ కోల్‌కతా మ్యాచ్‌ నేపథ్యంలో గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఈ రోజు (శుక్రవారం) రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. ఇరు జట్ల మధ్య మ్యాచ్‌ నేపథ్యంలో కోల్‌కతా మెంటార్‌గా వ్యవహరిస్తున్న గౌతమ్ గంభీర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మపై తనకు చాలా గౌరవం ఉందని అన్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా ఉన్న రోజుల్లో రోహిత్ శర్మకు తాను ఎక్కువ భయపడ్డానని గుర్తుచేసుకున్నాడు. ప్రపంచ క్రికెటర్లలో అత్యుత్తమ బ్యాటర్లు ఎదురైనప్పటికీ రోహిత్ కంటే ఎక్కువ ఎవరూ భయపెట్టలేకపోయారని అన్నాడు. రోహిత్‌ను పరుగులు చేయకుండా ఎలా నిలువరించాలనేదానిపై ఎప్పటికప్పుడు ప్రణాళికలను రూపొందించాల్సి వచ్చేదని గంభీర్ పేర్కొన్నాడు. ఐపీఎల్ బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడుతూ గంభీర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

తన క్రికెట్ కెరియర్‌లో ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ వంటి దిగ్గజ బ్యాటర్లను ఎదుర్కొనేందుకు ప్రణాళికలను అమలు చేశానని, కానీ రోహిత్‌ విషయంలో తాను చాలా ఇబ్బందులు ఎదుర్కొనట్టు గంభీర్ వివరించాడు. ‘‘నేను భయపడిన ఏకైక బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ. నాకు నిద్రలేని రాత్రులు ఇచ్చిన ఏకైక బ్యాటర్ అతడు. క్రిస్ గేల్ కాదు, ఏబీ డివిలియర్స్ కాదు. రోహిత్ మాత్రమే నన్ను భయపెట్టాడు. ప్లాన్ ఏ, ప్లాన్ బీ అవసరమైతే ప్లాన్ సీ కూడా ఉండాలని నాకు తెలుసు. ఎందుకంటే వీటిలో ఏ ప్రణాళికలూ రోహిత్ శర్మను నిలువరించగలవని నేను అనుకోను’’ అని అన్నాడు. ‘స్టార్ స్పోర్ట్స్‌’తో మాట్లాడుతూ గంభీర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

ఐపీఎల్‌లో ఒక్క రోహిత్ శర్మ తప్ప మరే ఇతర బ్యాటర్‌కు తాను ప్లాన్ చేయలేదని గంభీర్ అన్నాడు. సాధారణంగా బ్యాటర్ల విజువల్స్ చూసి ప్లాన్స్ వేసేవాడినని, అయితే రోహిత్ కోసం మాత్రం మ్యాచ్ ముందు రోజు రాత్రి నుంచే ఆలోచించేవాడిని పేర్కొన్నాడు.


Gautam Gambhir
Rohit Sharma
IPL 2024
Cricket
Mumbai Indians
Kolkata Knight Riders

More Telugu News