RS Praveen Kumar: 33 జిల్లాలను 15కు కుదిస్తే తెలంగాణ అగ్నిగుండంగా మారుతుంది: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరిక

RS Praveen Kumar warns on district reduction
  • పరిపాలనా సౌలభ్యం కోసమే కేసీఆర్ 33 జిల్లాలుగా పునర్విభజన చేశారన్న ప్రవీణ్ కుమార్
  • జిల్లాల సంఖ్యను కుదిస్తే కొత్త సమస్యలు వస్తాయని హెచ్చరిక
  • మల్లు రవి ప్రాంతేతరుడు... ఆయనను ఓడించాలన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 33 జిల్లాలను కుదించి 15 జిల్లాలుగా పునర్విభజన చేస్తే అగ్నిగుండంగా మారుతుందని నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. శుక్రవారం ఆయన నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... పరిపాలనా సౌలభ్యం కోసమే కేసీఆర్ పది జిల్లాలుగా ఉన్న తెలంగాణను 33 జిల్లాలుగా పునర్విభజన చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ వీటిని 15 జిల్లాలుగా కుదించే అవకాశముందన్నారు.

కొత్త జిల్లాల కేంద్రంగా పాలన సవ్యంగా సాగుతోందని... మళ్లీ జిల్లాల సంఖ్యను కుదిస్తే కొత్త సమస్యలు వస్తాయన్నారు. ప్రస్తుతం నాలుగు జిల్లాలుగా ఉన్న పాలమూరును రెండు జిల్లాలుగా మార్చే అవకాశముందన్నారు. అప్పుడు జోగులాంబ గద్వాలను మహబూబ్ నగర్ జిల్లాలో, వనపర్తిని నాగర్ కర్నూలు జిల్లాలో కలిపే అవకాశముందన్నారు.

కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి మనకు ప్రాంతేతరుడని... ఆయనను ఓడించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రెండుసార్లు ఎంపీగా గెలిచినా ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తన సోదరుడిని గెలిపించుకోవడానికి విచ్చలవిడిగా డబ్బులను ఖర్చు చేస్తున్నారన్నారు. మల్లు రవిని గెలిపిస్తే ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు నోట్ల కట్టలు తీసుకుపోయే వ్యక్తిగా మిగులుతాడు తప్ప ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడన్నారు. తాను స్థానికుడినని... తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

బీజేపీ మతవిద్వేషాలు రెచ్చగొడుతోందని ఆరోపించారు. ఇంటింటికి అయోధ్య బాలరాముడి అక్షితలు పంపిస్తూ హిందూ ధర్మాన్ని తామే రక్షిస్తున్నట్లుగా చెప్పుకుంటోందని విమర్శించారు. అయోధ్య రామాలయం కంటే ముందే దేశంలో కోట్లాది రామమందిరాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. బీజేపీకి 400 సీట్లు ఇస్తే కనుక రాజ్యాంగాన్ని రద్దు చేస్తుందని, రిజర్వేషన్లను తొలగిస్తుందని హెచ్చరించారు.

కర్ణాటక సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఎంతోమంది అమ్మాయిలను వేధించి, అత్యాచారాలకు పాల్పడిన రేపిస్ట్ అని మండిపడ్డారు. అలాంటి రేపిస్టుకు మద్దతిచ్చి... సాక్షాత్తు మోదీ ఎన్నికల ప్రచారం చేయడం దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్ పార్టీ హామీల అమలులో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రైతుబంధు, రైతుకూలీ హామీ అటకెక్కిందని, వరికి బోనస్ ఇవ్వడం లేదన్నారు. భూమి ఉన్న ప్రతి రైతుకు రైతుబంధు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పోస్టుకార్డు ఉద్యమం నిర్వహిస్తున్నామన్నారు.

  • Loading...

More Telugu News