T20 World Cup 2024: దాయాదుల పోరా మజాకా.. న్యూయార్క్‌లో ఆకాశ‌న్నంటిన హోట‌ల్ ధ‌ర‌లు!

Hotel Prices in New York Sees A 600 Percent Jump Ahead of IND vs PAK ICC T20 World Cup 2024 Clash
  • జూన్ 9న న్యూయార్క్ వేదిక‌గా భార‌త్‌, పాక్ పోరు
  • న్యూయార్క్‌లో 600 శాతం పెరిగిన హోట‌ళ్ల ధ‌ర‌లు
  • ప్ర‌స్తుతం అక్క‌డి కొన్ని హోట‌ళ్ల‌లో రూమ్‌ ధ‌ర‌ రూ. 9,422
  • అదే మ్యాచ్ ఉన్న రోజు ఈ ధ‌ర రూ. 66,624 పలుకుతున్న వైనం
అమెరికా, వెస్టిండీస్ ఆతిథ్య‌మిస్తున్న టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫీవ‌ర్ మొద‌లైంది. మ‌రో 29 రోజుల్లో ఈ పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ టోర్నీ ప్రారంభం కానుంది. ఈసారి 20 దేశాలు పాల్గొంటున్న ఈ ఐసీసీ టోర్నీలో మొత్తం 55 మ్యాచులు జ‌ర‌గ‌నున్నాయి. జూన్ 2 నుంచి 29వ తేదీ వ‌ర‌కు టోర్న‌మెంట్‌ జ‌ర‌గ‌నుంది. అయితే, ఇప్పుడు అంద‌రి దృష్టి జూన్ 9న ఉన్న దాయాదుల పోరుపై ఉంది. న్యూయార్క్ వేదిక‌గా జ‌రిగే ఈ మ్యాచ్ కోసం ప్ర‌పంచంలోని క్రికెట్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక‌ భార‌త్‌, పాక్ మ్యాచ్ క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. 

ఎలాగైనా ప్రత్య‌క్షంగా మ్యాచ్ చూడాల‌నుకునే అభిమానులు చాలా మంది ఉంటారు. దానికోసం ఎంత‌టి వ్య‌యానికైనా వెన‌కడుగు వేయ‌రు. ఇక గ‌తేడాది స్వ‌దేశంలో జ‌రిగిన వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో భాగంగా అహ్మదాబాద్‌లో జ‌రిగిన పాక్‌, టీమిండియా మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఎలా పోటీ ప‌డ్డారో తెలిసిందే. మ్యాచ్ టికెట్లు దొరికిన వారు బ‌స కోసం తీవ్ర ఇక్క‌ట్లు ప‌డ్డారు. ఎందుకంటే హోట‌ళ్లు అన్ని హౌస్‌ఫుల్ బోర్డులు పెట్టేశాయి. ఇక వాటి ధ‌ర‌లు కూడా ఆక‌శాన్నంటాయి. 

ఇప్పుడు అచ్చం ఇలాంటి ప‌రిస్థితినే న్యూయార్క్‌లో నెల‌కొంది. అక్క‌డి హోట‌ళ్ల ధ‌ర‌ల‌కు రెక్క‌లొచ్చేశాయి. కొన్ని హోట‌ళ్ల రేట్లు ఏకంగా 600 శాతం పెరిగిపోయాయి. ప్ర‌స్తుతం న్యూయార్క్‌లోని కొన్ని హోట‌ళ్ల‌లో రూమ్స్ ధ‌ర‌ రూ. 9,422గా ఉంటే.. మ్యాచ్ ఉన్న రోజు ఈ ధ‌ర రూ. 66,624గా ఉండ‌డం గ‌మ‌నార్హం.  దీన్నిబ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు భార‌త్‌, పాక్ మ్యాచ్ క్రేజ్ ఏంటి అనేది. 

ఇదిలాఉంటే.. 2022లో జ‌రిగిన టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో మెల్‌బోర్న్ వేదిక‌గా జ‌రిగిన దాయాదుల పోరులో టీమిండియానే పైచేయి సాధించిన విష‌యం తెలిసిందే. పాక్‌ను భార‌త్ ఆరు వికెట్ల తేడాతో మ‌ట్టిక‌రిపించింది.
T20 World Cup 2024
IND vs PAK
New York
Hotel Prices
Cricket
Sports News
Team India

More Telugu News