texas chicken: సోదరిపై చికెన్ విసిరినందుకు కటకటాల్లోకి..!

Florida Man Arrested for Throwing Fried Chicken at Sister During Argument
  • యువకుడిపై గృహ హింస కింద కేసు నమోదు.. అరెస్టు
  • ఫ్లోరిడాలోని క్లియర్ వాటర్ సిటీలో విచిత్ర ఘటన
  • తనకు ఇష్టంలేని చికెన్ ను వడ్డించడంతో కోపం వచ్చిందన్న యువకుడు

అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ 20 ఏళ్ల యువకుడు ఆవేశంలో చేసిన పని కటకటాలు లెక్కపెట్టాల్సిన దుస్థితి కల్పించింది! ఏకంగా గృహ హింస కింద కేసు ఎదుర్కోవాల్సిన పరిస్థితికి దారితీసింది!

ఖాన్యే ఎడ్రాయీజ్ మెడ్లే అనే యువకుడు ఇటీవల ఫ్లోరిడాలోని క్లియర్ వాటర్ సిటీలో ఉండే తన సోదరి ఇంటికి వెళ్లాడు. అనంతరం ఇద్దరూ భోజనానికి కూర్చున్నారు. భోజనంలో సోదరి టెక్సాస్ చికెన్ వడ్డించంతో మెడ్లే ఒక్కసారిగా ఆవేశంతో ఊగిపోయాడు. తన సోదరితో వాగ్వాదానికి దిగాడు. కోపం పట్టలేక టేబుల్ పై ఉన్న చికెన్ ముక్కలను ఆమెకేసి బలంగా కొట్టాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇంకేముంది.. పినెల్లాస్ కౌంటీ అధికారులు వచ్చి మెడ్లేను అరెస్టు చేశారు. చికెన్ ముక్కలతో భౌతిక దాడికి పాల్పడటం గృహ హింస కిందకే వస్తుందంటూ కేసు నమోదు చేశారు. అనంతరం అతన్ని అరెస్టు చేసి జైల్లో పెట్టారు.

పోలీసుల విచారణలో మెడ్లే తన నేరాన్ని అంగీకరించాడు. సోదరి ఇంటికి వెళ్లిన సమయంలో విపరీతమైన ఆకలితో ఉన్నట్లు చెప్పాడు. కానీ అప్పుడు తనకు చికెన్ తినే ఉద్దేశం ఎంతమాత్రం లేదన్నాడు. కానీ ఆమె తినేందుకు చికెన్ మాత్రమే పెట్టడంతో అసహనానికి గురైనట్లు వివరించాడు. ఈ విషయంలో ఇరువురి మధ్య మాటామాటా పెరిగి సోదరిపై చికెన్ ముక్కలు విసిరినట్లు చెప్పుకొచ్చాడు. 

అయితే బెయిల్ బాండ్ సమర్పించడంతో ఒక రోజు జైల్లో ఉన్నాక పోలీసులు అతన్ని విడుదల చేశారు. వివిధ నేరాల వార్తలను తెలియజేసే ద స్మోకింగ్ గన్ అనే వెబ్ సైట్ ఈ వివరాలను వెల్లడించింది. మరోవైపు అంతకు ముందు వారం కూడా ఫ్లోరిడా కౌంటీలో ఇదే తరహా ఘటన మరొకటి చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న ఓ కారులో లైట్ల ఫోకస్ కంట్లో పడటంతో నోలాన్ గోయిన్స్ అనే వాహనదారుడు చికాకు పడ్డాడు. తాను తింటున్న పాస్తా, సాస్ ను వెంటనే కిటికీలోంచి కారు నడుపుతున్న అవతలి వ్యక్తిపై విసిరేశాడు. దీంతో అతను ఇచ్చిన ఫిర్యాదుతో  పోలీసులు నోలాన్ ను అరెస్టు చేశారు. అనంతరం బెయిల్ బాండ్ సమర్పించడంతో విడుదల చేశారు.

  • Loading...

More Telugu News