Padma Awards 2025: 2025 పద్మ అవార్డుల నామినేషన్ ప్రక్రియ ప్రారంభం

  • ఆన్‌లైన్ ద్వారా నామినేషన్ ప్రక్రియ 
  • నామినేష‌న్ స్వీక‌ర‌ణ‌కు గ‌డువు సెప్టెంబర్ 15
  • పేరును 'పీపుల్స్ పద్మ'గా మార్చే యోచ‌న‌   
Nomination process for Padma Awards 2025 begins

పద్మ అవార్డులు 2025 కోసం ఆన్‌లైన్ నామినేషన్ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. సెప్టెంబర్ 15వ తేదీ నామినేష‌న్ స్వీక‌ర‌ణ‌కు గ‌డువు. అవార్డుల కోసం నామినేషన్లు లేదా సిఫార్సులను 'రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్‌'లో ఆన్‌లైన్ ద్వారా స్వీకరించడం జ‌రుగుతుంది. అలాగే నామినేషన్లు రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్‌లో అందుబాటులో ఉన్న ఫార్మాట్‌లో పేర్కొన్న అన్ని సంబంధిత వివరాలను కలిగి ఉండాలి. అవార్డుల‌కు సిఫార్సు చేయబడిన వ్యక్తుల విశిష్టమైన, అసాధారణమైన విజయాలను స్పష్టంగా తెలియజేయాలి. దీనికి సంబంధించిన వివరాలు హోం మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లోని పద్మ అవార్డుల పోర్టల్‌లో  'అవార్డ్స్ అండ్ మెడల్స్' శీర్షికలో కూడా అందుబాటులో ఉంచ‌డం జ‌రిగింది.

ఇక‌ పద్మ అవార్డులు భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న తర్వాత అత్యంత ముఖ్యమైన గౌరవాలు. వీటిని మూడు విభాగాలలో ఇవ్వడం జరుగుతుంది. పద్మ పుర‌స్కారాల‌ను భారత ప్రభుత్వం 1954లో ప్రారంభించింది. 1955లో దీనికి పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అని పేరు పెట్టారు. అప్పటి నుంచి ప్రతియేటా భారత రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ అవార్డుల ప్రదానం జ‌రుగుతోంది. వివిధ రంగాల‌లో విశిష్టమైన సేవ చేసిన వారికి ప‌ద్మ అవార్డులు ఇవ్వ‌డం జ‌రుగుతుంది. 

కళ, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ‌, సైన్స్, ఇంజనీరింగ్, పబ్లిక్ అఫైర్స్, సివిల్ సర్వీస్, వాణిజ్యం, పరిశ్రమలు ఇలా అన్ని రంగాలలో విశిష్టమైన సేవలకు ప‌ద్మ పుర‌స్కారాలు అందించబడతాయి. జాతి, వృత్తి, స్థానం, లింగ భేదం లేకుండా వ్యక్తులందరూ ఈ అవార్డులకు అర్హులే. అయితే, వైద్యులు, శాస్త్రవేత్తలు మినహా పీఎస్‌యూలలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు పద్మ అవార్డులకు అర్హులు కాదు.

ఇదిలాఉంటే.. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం పద్మ అవార్డులను 'పీపుల్స్ పద్మ'గా మార్చే యోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

More Telugu News