Glass Symbol: గాజు గ్లాసు గుర్తు... హైకోర్టులో జనసేనకు పూర్తిస్థాయిలో దక్కని ఊరట

Janasena gets partial relief in glass symbol
  • ఏపీలో పొత్తు కారణంగా 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్న జనసేన
  • గాజు గ్లాసును ఫ్రీ సింబల్ కేటగిరీలో చేర్చిన ఎన్నికల సంఘం 
  • ఇండిపెండెంట్లకు గ్లాసు గుర్తు కేటాయించే అవకాశం
  • ఓట్లు చీలతాయని ఆందోళన చెందుతున్న జనసేన
  • ఏపీ హైకోర్టులో పిటిషన్
ఏపీలో పొత్తు కారణంగా జనసేన పార్టీ ఈసారి ఎన్నికల్లో 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తోంది. అయితే, జనసేన పార్టీకి చెందిన గాజు గ్లాసు గుర్తును ఈసీ ఫ్రీ సింబల్ కేటగిరీలో చేర్చడంతో సమస్య వచ్చి పడింది. తాము పోటీ చేయని చోట్ల గాజు గ్లాసు గుర్తును ఇండిపెండెంట్ అభ్యర్థులకు కేటాయించవద్దంటూ జనసేన పార్టీ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. 

అయితే, జనసేన పిటిషన్ ను ఏపీ హైకోర్టు నిన్న విచారించింది. వివరణ ఇచ్చేందుకు ఈసీ 24 గంటల గడువు కోరడంతో విచారణ నేటికి వాయిదా వేసింది. ఇవాళ విచారణ కొనసాగింపు సందర్భంగా ఎన్నికల సంఘం నేడు కోర్టుకు వివరణ ఇచ్చింది. 

జనసేన పార్టీ పోటీ చేస్తున్న మచిలీపట్నం, కాకినాడ ఎంపీ స్థానాల పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో గాజు గ్లాసు గుర్తును ఎవరికీ కేటాయించబోమని కోర్టుకు తెలియజేసింది. అంతేకాకుండా, జనసేన పార్టీ పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ స్థానాలు ఏ ఎంపీ స్థానాల పరిధిలోకి వస్తాయో, ఆయా ఎంపీ స్థానాల్లో అభ్యర్థులకు కూడా గాజు గ్లాసు గుర్తును కేటాయించబోమని ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది అవినాశ్ దేశాయ్ హైకోర్టుకు వివరించారు. 

ఒక విధంగా ఇది జనసేనకు పాక్షిక ఊరటగానే చెప్పుకోవాలి. ఎందుకంటే, జనసేన పోటీ చేసే స్థానాలు మినహాయించి మిగతా చోట్ల ఎవరికైనా గాజు గ్లాసు గుర్తు కేటాయిస్తే, ఓట్లు చీలే ప్రమాదం ఉందని జనసేన నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Glass Symbol
Janasena
AP High Court
EC
Andhra Pradesh

More Telugu News