Sajjala Ramakrishna Reddy: మేం ఏం చేయాలో చెప్పడానికి ఈయన ఎవరు?: చంద్రబాబుపై సజ్జల ఫైర్

  • మే 1న డీబీటీ ద్వారా పెన్షన్ల పంపిణీ
  • ఇళ్ల వద్దనే పెన్షన్లు ఇవ్వాలంటున్న చంద్రబాబు
  • ఉన్న వ్యవస్థను దెబ్బతీసింది చంద్రబాబేనన్న సజ్జల
  • ఇప్పుడు కూడా మళ్లీ తయారయ్యాడని విమర్శలు
  • ఈయనేమైనా ప్రభుత్వంలో ఉన్నాడా అంటూ ఆగ్రహం
Sajjala take a jibe at Chandrababu over pensions distribution fiasco

మే 1న ఇళ్ల వద్దనే పెన్షన్లు ఇవ్వాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన డిమాండ్ పట్ల ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి స్పందించారు. పట్టుబట్టి మరీ వాలంటీర్లను పెన్షన్ల పంపిణీకి దూరం చేశాడంటూ చంద్రబాబుపై మండిపడ్డారు. 

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఎన్నికల సంఘం అడిగిందని, దాంతో సచివాలయాలకు రాగలిగేవారు రావొచ్చని, రాలేనివారికి ఇంటివద్దనే పెన్షన్లు ఇచ్చే ఏర్పాటు చేశామని వెల్లడించారు. వీలైనంత త్వరగా పెన్షన్లు అందించేందుకు ఈ ఏర్పాట్లు చేశామని తెలిపారు. అయితే, అప్పటికే తన మీద వ్యతిరేకత వస్తోందని భయపడిన చంద్రబాబు... 1 లక్ష 20 వేల మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారని, వారితో ఇంటింటికీ పంపిణీ చేయించొచ్చు కదా అని కొత్త బాణీ అందుకున్నారని సజ్జల ఆరోపించారు. 

ఏదేమైనా జగన్ మోహన్ రెడ్డి పెట్టిన ఉద్యోగులు అని చంద్రబాబు ఒప్పుకున్నాడని వ్యాఖ్యానించారు. "పెన్షన్లు ఇలా ఇవ్వాలి, అలా ఇవ్వాలి అని లెక్కలేసి చెబుతున్నాడు... అసలు ఎవరీయన? ఈయనేమైనా ప్రభుత్వంలో ఉన్నాడా? ఒకపక్క ఉన్న వ్యవస్థను ఈయనే దెబ్బతీస్తాడు. మళ్లీ ఆ వ్యవస్థ బదులు ప్రభుత్వం ఏం చేయాలో కూడా ఈయనే చెబుతాడు. అలా చేయకపోతే నేను ఒప్పుకోను అంటాడు. 

తనకు ఏం అధికారం ఉందని ప్రతి రోజూ ఎన్నికల సంఘం వద్దకు పంపించడం, ఎన్నికల సంఘంపై ఒత్తిడి పెంచడం చేస్తున్నాడు? తనకున్న మీడియాలో అడ్డగోలుగా బ్లాక్ మెయిల్ చేస్తూ అధికారులపై రాయిస్తున్నాడు. ఈయన ఇప్పుడే కాదు, అధికారంలో ఉన్నప్పుడు కూడా అంతే. సీఎంగా ఉన్నప్పుడు 2019కి ముందు కూడా సీఈవోపై దాడి చేసినంత పనిచేశాడు. హూంకరించాడు, దబాయించాడు... ఇప్పుడూ అదే చేస్తున్నాడు. 

మామూలుగా సాఫీగా జరుగుతున్న వ్యవస్థను ఎవరు బ్రేక్ చేయమన్నారు? అందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరుగుతున్నాయి కదా. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సచివాలయంలో అందరూ పనిచేస్తున్నారు. ఆ సిస్టమ్ ను అలాగే వదిలేస్తే రెండు మూడ్రోజుల్లో పెన్షన్ల పంపిణీ పూర్తవుతుంది. చంద్రబాబు భయం ఏంటంటే... తన వల్లనే వాళ్లు రోడ్డెక్కాల్సి వచ్చింది. సచివాలయాల వరకు పెన్షనర్లు వెళ్లాల్సి వచ్చింది అనేది ఆయన భయం.... వృద్ధులు, అశక్తులు ఆ కోపాన్ని తన మీద చూపిస్తారని ఆయన భయం. 

ఆ భయంతోనే మళ్లీ వరుసబెట్టి పిటిషన్ల మీద  పిటిషన్లు వేయిస్తున్నాడు. అందుకే ఇళ్లకు తీసుకెళ్లి పెన్షన్లు ఇవ్వాల్సిందే... లేకపోతే ఆ 32 మంది నువ్వే చంపినట్టు అవుతుంది అని బెదిరిస్తున్నాడు. శవరాజకీయాలు అంటున్నాడు... శవరాజకీయాలు చేసింది ఎవరు... ఈయనే. ఈ రోజు ఈసీ నుంచి విస్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. దాన్ని పట్టుకుని మళ్లీ డీబీటీ కాదు, ఇళ్ల వద్దకే ఇవ్వాలంటున్నాడు. 

అంతేకాదు, చంద్రబాబు గ్యాంగు మొత్తం గవర్నర్ ను కలిసి, ఢిల్లీలోనే మకాం పెట్టి పొద్దున లేచినదగ్గర్నుంచి ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెస్తున్నారు. సీఎస్ చేతిలో సీఈవో ఉన్నాడా... సీఈవో చేతిలో సీఎస్ ఉన్నాడా అంటూ ఈనాడులో రాసి, బ్లాక్ మెయిల్ చేసి ఒత్తిడి తీసుకువచ్చి మళ్లీ ఈసీతో ఒక లెటర్ ఇప్పించారు. ఈ క్రమంలో... డీబీటీ లింక్ ఎంతమందికైతే ఉందో, వారికి ఆ విధానంలో పెన్షన్లు ఇస్తాం... లేనివారికి ఇళ్ల వద్దకు వెళ్లి ఇస్తాం... ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నాం. తప్పు ఎవరిది ఇందులో? ఎవరిది ఈ పాపం? చంద్రబాబుది కాదా?" అని సజ్జల ధ్వజమెత్తారు.

More Telugu News