G. Kishan Reddy: ఆ వీడియోపై రేవంత్ రెడ్డిని కోర్టుకీడుస్తాం: కిషన్ రెడ్డి హెచ్చరిక

  • అమిత్ షా ఫేక్ వీడియోపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశామని వెల్లడి
  • ముఖ్యమంత్రి ఇలాంటి ఆరోపణలు చేయడం క్షమించరాని నేరమని వ్యాఖ్య
  • రేవంత్ రెడ్డికి నైతికత ఉంటే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్
  • ఎమ్మెల్యేల్ని నిలబెట్టుకోలేని కేసీఆర్ ఢిల్లీలో చక్రం తిప్పుతారట... అంటూ ఎద్దేవా
  • కామారెడ్డిలో కేసీఆర్‌ను, నిజామాబాద్‌లో కవితను ఓడించింది బీజేపీయేనని వ్యాఖ్య
Kishan Reddy warns Revanth Reddy

అమిత్ షా ఫేక్ వీడియోపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోర్టుకీడుస్తామని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... అమిత్ షా వీడియోను మార్ఫింగ్ చేసి కాంగ్రెస్ పార్టీ పోస్ట్ చేసిందన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఇప్పటికే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు. ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రి ఇలాంటి ఆరోపణలు చేయడం క్షమించరాని నేరమన్నారు. ఆయనపై కోర్టుకు వెళతామన్నారు.

ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇంతలా దిగజారడం సరికాదన్నారు. ఆయన ఇంకా పార్టీ నాయకుడినే అనుకుంటున్నారు తప్ప సీఎంనని అనుకోవడం లేదన్నారు. రేవంత్ రెడ్డికి నైతికత ఉంటే... చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకొని, బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్... వాటిని 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పినప్పటికీ... అమలులో బొక్కబోర్లా పడిందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల విశ్వసనీయతను కోల్పోయిందన్నారు. రైతులు, మహిళలు, యువకులు... యావత్ తెలంగాణ సమాజమే రేవంత్ రెడ్డి మాటలను నమ్మడం లేదన్నారు. చివరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే నమ్మడం లేదన్నారు. ఎన్నికల్లో ఓడిపోయే కాంగ్రెస్ తమపై బురద జల్లేందుకు ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. అబద్దాలతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ డూప్లికేట్ ఫైట్ చేస్తున్నాయని ఆరోపించారు.

కేసీఆర్‌పై కిషన్ రెడ్డి ఆగ్రహం

గెలిచిన ఎమ్మెల్యేలను నిలబెట్టుకోలేని అసమర్థ పార్టీ అధినేత కేసీఆర్ కూడా ఢిల్లీకి వచ్చి చక్రం తిప్పుతానని అంటుంటే విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీకి 400 సీట్లు పక్కా వస్తాయని... కేసీఆర్ ఫామ్ హౌస్‌లో కూర్చొని ఏ చక్రమైనా తిప్పుకోవచ్చని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ను కామారెడ్డిలో ఓడించింది... కవితను నిజామాబాద్‌లో ఓడించింది బీజేపీయేనని కేసీఆర్ గుర్తించాలన్నారు. అక్షితలు, పులిహోర ప్రసాదంపై ఇష్టారీతిన మాట్లాడుతూ కేసీఆర్ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News