Sand Mining: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

  • ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
  • అక్రమ తవ్వకాలు ఆపేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు
  • తదుపరి విచారణ మే 10కి వాయిదా
Supreme Court issues orders on sand mining in AP

ఇసుక తవ్వకాల అంశంపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఇసుక తవ్వకాలు జరుపుతున్న తీరుపై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇసుక అక్రమ తవ్వకాలు వెంటనే నిలిపివేయాలని కీలక ఆదేశాలు జారీ చేసింది. 

నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) తీర్పును యథాతథంగా అమలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. పర్యావరణ అనుమతులు లేని ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని, అక్రమ తవ్వకాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది. అనుమతులు ఉన్నచోట మాన్యువల్ గా ఇసుక తవ్వకాలు జరుపుకోవచ్చని సూచించింది.

 అక్రమాలకు పాల్పడిన వారిపై నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వంతోపాటు, ఎన్జీటీని కూడా ఆదేశించింది. ఈ వ్యవహారంలో మే 9 లోపు అఫిడవిట్ దాఖలు చేయాలంటూ కేంద్ర పర్యావరణ, అటవీశాఖలను సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం కూడా మే 9వ తేదీ లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని తన ఆదేశాల్లో పేర్కొంది. తవ్వకాలు జరపడం లేదన్న విషయాన్ని అఫిడవిట్ రూపంలో తెలియజేయాలని జేపీ వెంచర్స్ ను ఆదేశించింది. 

ఎన్జీటీ తీర్పుపై ఎలాంటి స్టే విధించలేదని సుప్రీంకోర్టు వెల్లడించింది. పిటిషనర్ ఫిర్యాదుల మేరకు వెంటనే చర్యలు చేపట్టాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. క్రిమినల్ చట్టాల మేరకు ఎఫ్ఐఆర్ దాఖలుకు చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది. తదుపరి విచారణను మే 10కి వాయిదా వేసింది.

More Telugu News