Chandrababu: ఇళ్ల వద్దనే పెన్షన్ల పంపిణీ సాధ్యమే... చంద్రబాబు కీలక ప్రెస్ మీట్

  • ఏప్రిల్ నెలలో పెన్షన్ల పంపిణీ ప్రహసనంలా మారిన వైనం
  • సచివాలయాల వద్ద పెన్షన్లు ఇచ్చిన ప్రభుత్వం
  • పలువురు వృద్ధుల మృతి
  • మీరే కారణం అంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్న అధికార, విపక్షాలు
  • ఇళ్ల వద్ద పెన్షన్ల పంపిణీ పెద్ద కష్టమైన పనేం కాదంటూ వివరాలు తెలిపిన చంద్రబాబు
Chandrababu press meet on pension distribution at homes

మే 1వ తేదీ వస్తుండడంతో మళ్లీ అందరి దృష్టి పెన్షన్ల పంపిణీపై పడింది. ఏప్రిల్ నెలలో పెన్షన్ల పంపిణీ ఒక ప్రహసనంలా మారడం తెలిసిందే.

ఇళ్ల వద్దకే పెన్షన్లు అందించాలని ఈసీ ఆదేశించినా ప్రభుత్వం సచివాలయాల వద్ద పెన్షన్లు ఇచ్చిందని విపక్షాలు భగ్గుమనడం, విపక్షాలు వాలంటీర్లపై ఫిర్యాదు చేయడం వల్లే సచివాలయాల వద్ద ఇవ్వాల్సి వచ్చిందని, అందుకే పలువురు వృద్ధులు ఎండవేడిమికి మరణించారని ప్రభుత్వం ఎదురుదాడికి దిగడం అందరూ చూశారు. 

ఈ నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబు నేడు ప్రెస్ మీట్ పెట్టి పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాల్సిందేనని, ఈసీ ఆదేశాలు పాటించాలని డిమాండ్ చేశారు. "పెన్షన్లు ఇంటివద్దే పంపిణీ చేయండి... ఇది సాధ్యం. మీకు అధికారులు ఉన్నారు... సచివాలయాలు ఉన్నాయి... యంత్రాంగం ఉంది... ఇది పెద్ద కష్టమైన పని కాదు... అని చాలా స్పష్టంగా చెప్పినా ప్రభుత్వం వినిపించుకోవడంలేదు. 

ఈ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, సీఎంవోలో ఉండే పెద్ద పైరవీకారుడు ధనంజయరెడ్డి, సెర్ప్ సీఈవో మురళీధర్ రెడ్డి వీళ్లు కలిసి మళ్లీ అదే కుట్రకు తెరలేపారు. పెన్షన్ల పంపిణీపై మేం (ఎన్డీయే కూటమి) చాలాసార్లు ఎన్నికల సంఘాన్ని కలిశాం.... గవర్నర్ ను కలిశాం... ఏం చేస్తే బాగుంటుందనేది సూచనల రూపంలో తెలియజేశాం. 

ఎన్నికల సంఘం కూడా... ఇదేమంత  కష్టం కాదు, ఎలాగైనా ఇళ్ల వద్దనే పెన్షన్లు అందించాలని స్పష్టం చేసింది. పోయినసారి జరిగిన సంఘటనలు పునరావృతం కారాదని కూడా ఆదేశాలు ఇచ్చింది. 

సచివాలయాల ద్వారా 1.26 లక్షల మంది సిబ్బంది ఉన్నారు. 15 వేల మంది పంచాయతీ కార్యదర్శులు, 5 వేల మంది వెలుగు సిబ్బంది, 5 వేల మంది వ్యవసాయ శాఖ సిబ్బంది, 3 వేల మంది హార్టికల్చర్ సిబ్బంది ఉన్నారు. వీరందరూ గ్రామస్థాయిలో ఉన్నారు. వేలిముద్రలు, కనుపాపల నిర్ధారణ వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి. 

కానీ ప్రభుత్వం మొండికేస్తోంది. ఎన్నికల సంఘం చెప్పినా ప్రభుత్వం ససేమిరా అంటోంది. ఆయా సిబ్బంది గ్రామ స్థాయిలోనే పనిచేస్తున్నా వారికి లబ్దిదారుల ఇళ్లు తెలియవట... ఊర్లో ఎవరుంటున్నారో కూడా తెలియకుండా వాళ్లు ఉద్యోగాలు చేస్తున్నారా? 

ఇప్పుడు మళ్లీ కొత్త కుట్రకు తెరలేపారు... పింఛన్లు బ్యాంకులో వేస్తారట! కిందటిసారి ప్రభుత్వం ఏం చెప్పింది... మా వద్ద లబ్దిదారుల బ్యాంకు ఖాతాల వివరాలు లేవని చెప్పింది. పోయిన నెలలో లేని బ్యాంకు ఖాతాలు ఇప్పుడెలా వచ్చాయి? మీరెలాంటి కుట్రలు  చేసినా ప్రజలు నమ్ముతారనుకుంటున్నారా? ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. 

ప్రభుత్వం ఏంచెబుతోంది అంటే... ఆధార్ లింక్ అయినవాళ్లందరికీ బ్యాంకులో వేస్తామని, మిగిలిన వాళ్లందరికీ ఇంటికి వెళ్లి ఇస్తామని చెబుతోంది. రాష్ట్రంలో మొత్తం 65,49,000 మంది పింఛన్ లబ్దిదారులు ఉన్నారు. వీరిలో 48,92,000 మందికి అకౌంట్ వివరాలు లింక్ అయి ఉన్నాయట. అంటే దాదాపు 75 శాతం మందికి బ్యాంకు ఖాతాల్లో పింఛను జమచేస్తారట. మిగిలిన వారిలో ఎవరైతే అకౌంట్ వివరాలు లింకు లేని వాళ్లు, దివ్యాంగులు, నడవలేనివాళ్లు 16,57,000 మంది ఉన్నారంటున్నారు. 

ఎవరు నడవలేరు అనేది చెప్పేందుకు మీరేమైనా నిర్ధారణ చేశారా? చిరునామాలు ఉన్నాయా? రాత్రికి రాత్రే వెరిఫై చేశారా? మీ వద్ద ఎవరు వికలాంగులు, ఎవరు నడవలేరు అనే డేటా ఉంటే వాళ్ల ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్లు ఇవ్వొచ్చు కదా? 

దీన్నిబట్టి అర్థమవుతోంది ఏంటంటే... వీళ్లు బోగస్ సమాచారంతో కాలయాపన చేస్తున్నారనేది స్పష్టంగా తెలుస్తోంది. ఇది సరైన పంథా కాదు. ప్రజలను మోసం చేయొద్దు. ప్రభుత్వ యంత్రాంగం బాధ్యతతో పనిచేయాలి" అంటూ చంద్రబాబు పేర్కొన్నారు.

More Telugu News