Pawan Kalyan: 'కిర్లంపూడి పెద్దలు' అంటూ ముద్రగడకు పవన్ కల్యాణ్ కౌంటర్

Pawan Kalyan replies to Mudragada remarks
  • జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడిలో వారాహి విజయభేరి సభ
  • ముద్రగడ విమర్శలకు బదులిచ్చిన పవన్ కల్యాణ్
  • తానేమీ కావాలని సినిమాల్లోకి రాలేదని, అలా కుదిరింది అని వెల్లడి
  • వైసీపీ మద్దతుదారులు జగన్ ను గుడ్డిగా నమ్మవద్దని హితవు

కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడిలో నిర్వహించిన వారాహి విజయభేరి సభలో జనసేనాని పవన్ కల్యాణ్ ప్రసంగించారు. ఇటీవలే ముద్రగడ పద్మనాభంపై పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధించారు. 

సినిమా నటులకు ఏం తెలుసని కిర్లంపూడిలో ఉండే పెద్దలు అంటున్నారని, వారిపై తనకు సంపూర్ణ గౌరవం ఉందని అన్నారు. అయితే, సినిమా నటులు మనుషులు కారా? సినిమా నటులకు ప్రేమ ఉండదా? సినిమా నటులకు సామాజిక బాధ్యత ఉండదా? అని పవన్ ప్రశ్నించారు. తానేమీ సినిమాల్లోకి రావాలని అనుకోలేదని, తనకు కుదిరిందంతే అని పవన్ వెల్లడించారు. 

ఇక, భవన నిర్మాణ కార్మికుల కోసం ఓసారి వైజాగ్ వచ్చానని, ఆ సమయంలో పార్టీ నేతలు "బయటికి రావొద్దు సార్.. ఇంకా జనం రాలేదు" అన్నారని గుర్తుచేసుకున్నారు. పది మంది గుండె బలం ఉన్నవాళ్లు చాలు... మిగతా పోరాటం నేను నడిపిస్తానని ఎయిర్ పోర్టు నుంచి బయటికి వచ్చానని, వైజాగ్ సెంటర్ లోకి వెళ్లగానే 1000 మంది కనిపించారు, కాసేపటికి 10 వేల మంది అయ్యారు, ఆ తర్వాత చూస్తుండగానే 50 వేలు, లక్ష, లక్షన్నర మంది వచ్చారు... జనసేన పార్టీ గట్టిగా నిలబడితే అలా ఉంటుందని అని పవన్ వివరించారు. 

వకీల్ సాబ్ చిత్రంలో చెప్పింది కేవలం సినిమా డైలాగు కాదు... వారు నా కోసం నిలబడ్డా, నిలబడకపోయినా నేను వారి కోసం నిలబడతాను... ఆ మాట నా గుండె లోతుల్లోంచి వచ్చింది అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. 

"ఇందాక నన్ను జాతీయ పాత్రికేయుడు రాజ్ దీప్ సర్దేశాయ్ ఇంటర్వ్యూ చేశారు. కాపు సామాజిక వర్గం మీ వెనుక ఉందని మీరు రాజకీయాల్లోకి వచ్చారా? అని ఆయన అడిగారు. నేను ఆయనకు ఒకటే చెప్పాను. మీరు గానీ, నేను గానీ, ఎవరైనా గానీ ఏ కులంలో పుట్టాలి, ఎలా పుట్టాలి, ఏ రంగులో పుట్టాలి, ఏ హైట్ లో పుట్టాలి అని ముందే నిర్ణయించుకోలేం. ఎవరైనా అన్ని కులాలను గుండెల్లోకి తీసుకున్నప్పుడే నాయకుడు అవుతాడు. 

కష్టనష్టాలుంటాయి, ఆర్థిక అసమానతలు, సామాజిక అసమానతలు ఉంటాయి. ఎవరిలో ఏమున్నాయని నాయకుడు అనేవాడు చూసుకుంటూ, వాటిని సరిదిద్దుకుంటూ ముందుకెళ్లాలి. 

ఈ మధ్య ఎక్కడికి వెళ్లినా అరటిపండు తొక్క, అరటిపండు తొక్క అనే స్లోగన్ వినిపిస్తోంది. మీ భాషలోనే చెప్పాలంటే ఇది ఒక అరటిపండు తొక్క ప్రభుత్వం! తినిపడేసిన ఆ తొక్క ప్రభుత్వం మనకు ఏమీ చేయలేదు. వైసీపీ మద్దతుదారులకు చెబుతున్నాను... ఈసారి కూడా మీరు జగన్ ను నమ్మి గుడ్డిగా ఓటేస్తే మీ ఆస్తులు కూడా అమ్మేస్తాడు" అంటూ ధ్వజమెత్తారు.

  • Loading...

More Telugu News