Will Jacks: సెంచరీతో వార్ వన్ సైడ్ చేసిన విల్ జాక్స్... కోహ్లీ ఫైర్... ఆర్సీబీ అదిరేటి విజయం

  • నమ్మశక్యం కాని ఆటతీరు ప్రదర్శించిన విల్ జాక్స్
  • 201 పరుగుల లక్ష్యాన్ని 16 ఓవర్లలోనే ఛేదించిన బెంగళూరు
  • 41 బంతుల్లో 100 పరుగులు చేసిన జాక్స్
  • 5 ఫోర్లు, 10 సిక్స్ లతో వీరవిహారం
  • 44 బంతుల్లో 70 పరుగులు చేసిన కోహ్లీ
Will Jacks flashy century and Kohli stability drives RCB a massive victory

ఐపీఎల్ తాజా సీజన్ లో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న జట్టు... రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. గత మ్యాచ్ లో ఆ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఓడిస్తే... ఏదో అలా కుదిరిందిలే అనుకున్నారు. కానీ ఇవాళ గుజరాత్  టైటాన్స్ ను వారి సొంతగడ్డపైనే మట్టికరిపించిన విధానం చూస్తే "ఔరా ఆర్సీబీ" అనుకోకుండా ఉండలేరు. 

దీనికంతటికీ కారణం విల్ జాక్స్, విరాట్ కోహ్లీ. వీరిద్దరూ గుజరాత్ బౌలింగ్ ను ఊచకోత కోసిన తీరు చూసి తీరాల్సిందే. ముఖ్యంగా విల్ జాక్స్... సిక్సర్ల వర్షం కురిపించాడు. ఆఖరి ఓవర్లో రషీద్ ఖాన్ బౌలింగ్ లో ఏకంగా నాలుగు  సిక్సులు బాది సెంచరీ పూర్తి చేసుకోవడం ఈ మ్యాచ్ కే హైలైట్ గా నిలిచింది.

మ్యాచ్ విషయానికొస్తే... అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ ను చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బెంగళూరు... గుజరాత్ కు బ్యాటింగ్ ను అప్పగించింది. గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 200 పరుగులు చేసింది. 

ఇక లక్ష్యఛేదనలో ఆర్సీబీ ఆటగాళ్ల ఆటతీరు వర్ణించడానికి మాటలు సరిపోవు. 201 పరుగుల ఛేదనలో బెంగళూరు జట్టు కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయింది. కేవలం 16 ఓవర్లలోనే మ్యాచ్ ను ముగించింది. 

కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ 12 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సులతో 24 పరుగులు చేసి సాయి కిశోర్ బౌలింగ్ లో అవుటయ్యాడు. ఈ దశలో జతకలిసిన కోహ్లీ, విల్ జాక్స్ జోడీ గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ దాడులను తుత్తునియలు చేసింది. కోహ్లీ, జాక్స్ పోటాపోటీగా బాదుతూ ఎక్కడా రన్ రేట్ తగ్గకుండా చూశారు. 

14 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 1 వికెట్ నష్టానికి 148 పరుగులు కాగా... కోహ్లీ 69, జాక్స్ 44 పరుగులతో క్రీజులో ఉన్నారు. అక్కడ్నించి జాక్స్ మోత మోగించాడు. ఎంతగా అంటే... 14వ ఓవర్ తర్వాత కోహ్లీ చేసింది 1 పరుగు మాత్రమే కాగా, జాక్స్ ఏకంగా 56 పరుగులు బాదాడు. ఇదంతా మరో రెండు ఓవర్లలోనే జరిగిపోయింది. 16 ఓవర్లకే ఆర్సీబీ విజయాన్ని అందుకుంది. 

25 ఏళ్ల విల్ జాక్స్... బౌలర్ ఎవరన్నది చూడకుండా సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఆఖర్లో బెంగళూరు స్కోరు 200 పరుగులకు చేరుకుంది... ఒక్క పరుగు తీస్తే గెలుస్తుంది... ఆ సమయంలో జాక్స్ 94 పరుగుల మీదున్నాడు... రషీద్ ఖాన్ విసిరిన బంతిని భారీ సిక్స్ గా మలిచిన ఈ ఇంగ్లండ్ ఆటగాడు ఐపీఎల్ తో తన తొలి సెంచరీ నమోదు చేసుకోవడమే కాదు, బెంగళూరుకు అద్భుతమైన గెలుపును అందించాడు. 

జాక్స్ 41 బంతుల్లో 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి స్కోరులో 5 ఫోర్లు, 10 సిక్సులు ఉన్నాయి. మరో ఎండ్ లో కోహ్లీ 44 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులతో 70 పరుగులు చేశాడు. కోహ్లీ, జాక్స్ అజేయంగా నిలిచారు.

  • Loading...

More Telugu News