prachi nigam: ‘చాణక్యుడినీ ఎగతాళి చేశారు’.. తన రూపంపై ట్రోలర్ల నోరు మూయించిన యూపీ టెన్త్ టాపర్

  • ట్రోలర్లను ఏమాత్రం పట్టించుకోనని స్పష్టీకరణ
  • వారి కామెంట్లు తనను ప్రభావితం చేయలేవని వ్యాఖ్య
  • ఎవరైనా అంతిమంగా లెక్కలోకి తీసుకొనేది మార్కులే తప్ప రూపం కాదని వెల్లడి
UP Board Topper Prachi Nigam Shuts Trollers

తన రూపాన్ని చూసి సోషల్ మీడియాలో ఎగతాళి చేసిన ట్రోలర్లకు యూపీ టెన్త్ టాపర్ ప్రాచీ నిగమ్ గట్టి కౌంటర్ ఇచ్చింది. అంతిమంగా లెక్కలోకి వచ్చేది మార్కులే కానీ ఆహార్యం కాదని వారి నోరు మూయించింది.

ఉత్తరప్రదేశ్ పదో తరగతి బోర్డు ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో ప్రాచీ నిగమ్ 98.5 శాతం మార్కులతో స్టేట్ టాపర్ గా నిలవడం తెలిసిందే. దీంతో నెట్టింట ఆమె ఫొటో వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో కొందరు సోషల్ మీడియాలో ఆమె ముఖంపై ఉన్న అవాంఛిత రోమాలను ఎగతాళి చేస్తూ కామెంట్లు పెట్టారు. మరికొందరు మాత్రం ఆమె సాధించిన మార్కులను అభినందిస్తూ ఆమెకు మద్దతుగా నిలిచారు.

ఈ అంశంపై ప్రాచీ నిగమ్ తాజాగా స్పందించింది. ‘సోషల్ మీడియా వేదికగా నాపై జరిగిన ట్రోలింగ్ నన్ను పెద్దగా బాధించలేదు. అంతిమంగా మార్కులే ముఖ్యం.. నా ముఖంపై ఉన్న అవాంఛిత రోమాలు కాదు. చాణక్యుడిని కూడా ఆయన ఆహార్యం చూసి కొందరు ఎగతాళి చేశారు. కానీ అది ఆయన్ను ఏమాత్రం ప్రభావితం చేయలేదు’ అని ప్రాచీ నిగమ్ గుర్తుచేసింది.

అదే సమయంలో తనకు అండగా నిలిచిన వ్యక్తులకు ప్రాచీ నిగమ్ కృతజ్ఞతలు తెలిపింది. ‘యూపీ బోర్డ్ టాపర్ గా నా ఫొటో సోషల్ మీడియాలో కనిపించగానే కొందరు నా రూపాన్ని చూసి ఎగతాళి చేశారు. అదే సమయంలో కొందరు నాకు అండగా కూడా నిలిచారు. వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. నా ముఖంపై ఉన్న అవాంఛిత రోమాలను చూసి అసహ్యంగా ఉందని భావించే వాళ్లు ఇంకా ట్రోల్ చేసుకోండి. అది నాలో ఎలాంటి తేడా కలిగించదు’ అని ప్రాచీ నిగమ్ చెప్పింది.

అయితే ఆమెపై ట్రోలింగ్ ను సోషల్ మీడియా యూజర్లు తిప్పికొట్టారు. ప్రాచీకి మద్దతుగా చాలా మంది కామెంట్లు పోస్ట్ చేశారు. అయితే ఇలాంటి వ్యాఖ్యలు ఆమె మనో నిబ్బరంపై ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా సైతం ప్రాచీకి అండగా నిలిచారు. చదువుపై దృష్టి పెట్టి కలలను సాకారం చేసుకోవాలని కోరారు. టెన్త్ పరీక్షల్లో సాధించిన ఫలితాలకుగాను ఆమెను అభినందించారు. ఇలాంటి ట్రోలింగ్ ల గురించి ఏమాత్రం బాధపడొద్దని సూచించారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

More Telugu News