titanic: ‘టైటానిక్’ సంపన్న ప్రయాణికుడి బంగారు వాచ్ కు వేలంలో రూ. 12.17 కోట్లు!

titanic passenger golden watch fetches record price in auction
  • గరిష్టంగా రూ. కోటిన్నర ధర పలకొచ్చని తొలుత అంచనా వేసిన నిర్వాహకులు
  • కానీ అనూహ్యంగా భారీ ధరకు కొన్న అమెరికాకు చెందిన ఓ ఔత్సాహికుడు
  • వేలం నిర్వాహక సంస్థ హెన్రీ ఆల్డ్ అండ్ సన్ వెల్లడి
టైటానిక్ షిప్ ప్రమాదం గురించి తెలుసుగా.. 1912 ఏప్రిల్ 15న ప్రయాణికులతో నిండిన ఈ ఓడ భారీ మంచు పలకను ఢీకొని సముద్రంలో మునిగిపోయింది. అందులో ప్రయాణించిన నాటి ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అమెరికా బిజినెస్ మ్యాగ్నెట్ జాన్ జాకబ్ ఆస్టర్ కూడా ఈ ప్రమాదంలో మృతిచెందారు. అయితే అప్పుడు ఆయన చేతికి ఉన్న బంగారు వాచ్ ను తాజాగా ఇంగ్లాండ్ లో వేలం వేశారు.  దీనికి రికార్డు స్థాయిలో ధర పలికింది. ఏకంగా 1.46 మిలియన్ డాలర్లకు అంటే మన కరెన్సీలో రూ. 12.17 కోట్లకు అమ్ముడుపోయింది.  వాచ్ ను వేలం వేసిన సంస్థ హెన్రీ ఆల్డ్ రిడ్జ్ అండ్ సన్ ఈ విషయాన్ని వెల్లడించింది.

ఈ వాచ్ కు వేలంలో లక్ష పౌండ్ల నుంచి లక్షన్నర పౌండ్ల వరకు అంటే సుమారు రూ. కోటి నుంచి రూ. కోటిన్నర వరకు రావొచ్చని నిర్వాహకులు అంచనా వేశారు. అయితే అమెరికాకు చెందిన ఓ ఔత్సాహికుడు వారి అంచనాలను పటాపంచలు చేస్తూ ఇంత భారీ ధరకు దాన్ని కొనుగోలు చేశాడు.

టైటానిక్ లో భార్య మెడిలీన్ తో కలసి ఆస్టర్ ప్రయాణించారు. ప్రమాద సమయంలో షిప్ లోని లైఫ్ బోట్ లలో ఒక దానిలోకి భార్యను ఎక్కించారు. అయితే తనను తాను కాపాడుకోలేక సముద్రంలో మునిగి మరణించారు. ఈ ప్రమాదం జరిగిన వారం రోజుల తర్వాత ఆస్టర్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అప్పుడు వారికి అందిన ఆస్టర్ వ్యక్తిగత వస్తువుల్లో వాచ్ కూడా ఉంది. 

ఆ తర్వాత కాలంలో ఆ వాచ్ ను పూర్తిస్థాయిలో రిపేర్ చేసి తిరిగి పనిచేసేలా చేశారు. ఆ వాచ్ పై జేజేఏ అనే అక్షరాలు ఉన్నాయి. ఆస్టర్ కుమారుడు కొంతకాలం దాన్ని ధరించారని వేలం నిర్వాహక సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. టైటానిక్ కు సంబంధించిన వస్తువుల్లోకెల్లా రికార్డు స్థాయి ధర పలికిన వస్తువు ఈ వాచేనని పేర్కొంది.
titanic
golden watch
auction
record price

More Telugu News