Rohit Sharma: కీలక పరిణామం.. రోహిత్ శర్మతో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ భేటీ

Rohit Sharma and Ajit Agarkar Informal Meeting In Delhi Over T20 World Cup Squad
  • టీ20 వరల్డ్ కప్ జట్టు ఎంపిక నేపథ్యంలో అనధికారిక సమావేశం
  • సెలక్షన్ కమిటీ భేటీకి ముందే స్పష్టత కోసం భేటీ జరిగిందంటూ కథనాలు
  • మే 1 లోగా 15 మంది ప్రాబబుల్స్ జాబితాను ప్రకటించనున్న బీసీసీఐ
అమెరికా, వెస్టిండీస్ వేదికగా జూన్ నెలలో ఆరంభం కానున్న టీ20 వరల్డ్ కప్‌కు భారత్ జట్టు ఎంపికపై ఆసక్తి నెలకొంది. ప్రాబబుల్స్ ప్రకటించాల్సిన కటాఫ్ తేదీ మే 1 సమీపిస్తుండడంతో ఎవరెవరికి చోటు దక్కనుందనేది మరింత ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో శనివారం కీలక పరిణామం జరిగింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ అనధికారికంగా భేటీ అయ్యారు. ముంబై ఇండియన్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య శనివారం జరిగిన మ్యాచ్‌ను వీక్షించేందుకు ఢిల్లీ వెళ్లిన అగార్కర్.. ముంబై జట్టుకి ప్రాతినిధ్యం వహిస్తున్న రోహిత్‌తో మాట్లాడాడు. వరల్డ్ కప్‌కి జట్టు ఎంపికకు సంబంధించి మిగతా సెలక్టర్లు, కీలక వ్యక్తులతో భేటీ జరగడానికి ముందే టీమ్‌పై స్పష్టత కోసం వీరిద్దరూ సమావేశమయ్యారని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

అయితే జట్టు ఎంపికలో రెండు స్థానాలపై మాత్రమే చర్చ ఉంటుందని తెలుస్తోంది. ఎక్కువ మంది ఆటగాళ్లు ఎలాంటి చర్చలేకుండా చోటు దక్కించుకుంటారని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఆశ్చర్యకరమైన ఎంపికలు ఏవీ ఉండవని సమాచారం. ఇక స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఫిట్‌నెస్‌ను సెలక్షన్ కమిటీ, టీమ్ మేనేజ్‌మెంట్ ఆమోదించాల్సి ఉంటుందని తెలుస్తోంది.

15 మంది ఆటగాళ్లలో హార్ధిక్ పాండ్యాకు చోటిస్తే శివమ్ దూబే లేదా రింకూ సింగ్‌లలో ఒకరికి మాత్రమే చోటు దక్కవచ్చని తెలుస్తోంది. మరోవైపు వికెట్ కీపర్ విషయంలో కేఎల్ రాహుల్ వెనుకబడ్డాడని, సంజూ శాంసన్‌ ముందు వరుసలో ఉన్నట్టు కథనాలు పేర్కొంటున్నాయి. లెఫ్ట్ హ్యాండర్ల ఎంపికకు అవకాశం చాలా తక్కువ ఉందని, ఒకవేళ ఎంపిక చేయాలనుకుంటే ముంబై ఇండియన్స్ బ్యాటర్ తిలక్ వర్మకు చోటు దక్కొచ్చనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. ప్రత్యర్థి జట్టులో ఎక్కువ మంది లెఫ్ట్ హ్యాండర్లు ఉంటే తిలక్ వర్మ ‘ఆఫ్ స్పిన్’ బౌలింగ్ కూడా చేయగల సామర్థ్యం అతడికి ఉంది. 

మరోవైపు మూడవ స్పిన్నర్‌ విషయంలో అక్షర్‌ పటేల్‌, రవి బిష్ణోయ్‌ మధ్య పోటీ నెలకొనే అవకాశాలున్నాయి. యజువేంద్ర చాహల్‌ పేరు పెద్దగా వినిపించకపోవడం గమనార్హం.
Rohit Sharma
Ajit Agarkar
T20 World Cup
BCCI
Team India

More Telugu News