Maheshwar Reddy: ఆ 22 మంది ఎమ్మెల్యేలకు హరీశ్ రావే నాయకత్వం వహిస్తున్నారా?: బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

  • రేవంత్ రెడ్డి, హరీశ్ రావు మధ్య చీకటి ఒప్పందమని ఆరోపణ
  • హామీల నుంచి తప్పించుకోవడానికి కొత్త కొత్త అంశాలను తెరపైకి తెస్తున్నారని వ్యాఖ్య
  • హామీలు నెరవేరిస్తే రాజీనామా చేస్తామని మొదట సవాల్ విసిరింది తామేనన్న బీజేపీ ఎమ్మెల్యే
  • రేవంత్ రెడ్డి తెలివిగా హరీశ్ రావును తెరపైకి తెచ్చారని విమర్శ
  • రేవంత్ రెడ్డి... బాలకృష్ణ డైలాగ్‌లు కొడుతున్నారని ఎద్దేవా
BJPLP Maheshwar Reddy questions revanth reddy about harish rao resignation

బీఆర్ఎస్ నుంచి 22 మంది ఎమ్మెల్యేలు తమ వైపు వస్తున్నారని కాంగ్రెస్ నేతలు గతంలో చెప్పారని... అలా వచ్చే వారికి నాయకత్వం వహిస్తోంది హరీశ్ రావేనా? బీఆర్ఎస్ నుంచి వచ్చే షిండే సిద్దిపేట ఎమ్మెల్యేనేనా? అని బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి, హరీశ్ రావు మధ్య చీకటి ఒప్పందం జరిగిందని... అందుకే వారు రాజీనామా పేరుతో డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.

హామీల నుంచి తప్పించుకోవడానికి ముఖ్యమంత్రి కొత్త కొత్త అంశాలను తెరపైకి తీసుకువస్తున్నారని ఆరోపించారు. లోక్ సభ ఎన్నికలు రెఫరెండం అని రేవంత్ రెడ్డి చెబుతున్నారని... అలాంటప్పుడు 14 సీట్లలో కాంగ్రెస్ గెలిస్తే మేం రాజీనామా చేస్తాం.. గెలవకుంటే రాజీనామాకు మీరు సిద్ధమా? అని సవాల్ విసిరితే వారు స్పందించడం లేదన్నారు. మీరు ఇచ్చిన హామీలపై ఎన్ని మాటల మార్చారో గుర్తుంచుకోవాలన్నారు. ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తే తాను రాజీనామాకు సిద్ధమన్నారు.

మొదట డిసెంబర్ 9, ఆ తర్వాత 100 రోజులు, ఇప్పుడు అగస్ట్ 15 అంటున్నారని మండిపడ్డారు. కేవలం డేట్లు మారుస్తూ... మాటలు మారుస్తూ ముందుకు సాగుతున్నారని విమర్శించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చినట్లు నిరూపిస్తే నేను రాజీనామాకు సిద్ధమని తాను మొదట సవాల్ చేస్తే... రేవంత్ రెడ్డి తెలివిగా హరీశ్ రావును తెరపైకి తెచ్చారని ఆరోపించారు. రాజీనామాలపై రేవంత్, హరీశ్ రావులు డ్రామాలు ఆడుతున్నారన్నారు.

అయినా రేవంత్ రెడ్డి పదేపదే రుణమాఫీ గురించి మాట్లాడుతున్నారని... కానీ 420 హామీలు ఇచ్చారనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. రుణమాఫీ గురించే మాట్లాడుతున్నారంటే మిగతా 419 హామీలు నెరవేర్చరా? అని ప్రశ్నించారు. రూ.4వేల పెన్షన్, మహిళలకు రూ.2500 తదితర హామీలపై ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలన్నారు.

పంద్రాగస్ట్ నాటికి ఇచ్చిన అన్ని హామీలను నెరవేరిస్తే నేను రాజీనామాకు సిద్ధమని... అవసరమైతే నా లేఖను గాంధీ భవన్ కు పంపిస్తాను... మీరే రాసుకోండని సవాల్ చేశారు. మీకు నచ్చిన ఫార్మాట్లో మీరు రాసుకోండి... నేను సంతకం చేస్తానన్నారు. అందుకు మీరు సిద్ధమేనా? చెప్పాలన్నారు. రేవంత్, హరీశ్ రావు మధ్య ఉన్న చీకటి ఒప్పందం ప్రజలు తెలుసుకుంటున్నారన్నారు. 

రేవంత్ రెడ్డి ఏమైనా అంటే రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తివేసే సమస్యే ఉండదన్నారు. రాజ్యాంగాన్ని అత్యధికసార్లు సవరణలు చేసింది... రాజ్యాంగాన్ని తుంగలో తొక్కింది కాంగ్రెస్ పార్టీయేనని విమర్శించారు. మైనార్టీల కోసం కాంగ్రెస్ చేసిన రిజర్వేషన్ల వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గం నష్టపోయిందన్నారు. కాంగ్రెస్ అజెండా ఎప్పుడూ మైనార్టీలను మోసే అజెండా అన్నారు.

 'రుణమాఫీ చేయకుంటే ఇక మేం అధికారంలోకి వచ్చి లాభమేమిటి?' అంటూ రేవంత్ రెడ్డి బాలకృష్ణ డైలాగ్‌లు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి వచ్చారని తమకు తెలుసునని... కానీ ఆయన బాలకృష్ణను ఇంతగా ఫాలో అవుతాడని తెలియదని వ్యాఖ్యానించారు.

More Telugu News