Indians: అమెరికాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురు భార‌తీయ మ‌హిళ‌ల దుర్మ‌ర‌ణం!

  • ద‌క్షిణ క‌రోలినాలోని గ్రీన్‌విల్లే కౌంటీలో ఘ‌ట‌న‌
  • మృతుల‌ను గుజ‌రాత్‌కు చెందిన రేఖాబెన్ ప‌టేల్‌, సంగీతబెన్ ప‌టేల్‌, మ‌నీషాబెన్ ప‌టేల్‌గా గుర్తించిన పోలీసులు
  • అతివేగమే ప్ర‌మాదానికి కార‌ణ‌మ‌న్న గ్రీన్‌విల్లే కౌంటీ పోలీసులు
3 Indian Women Killed In US As Speeding SUV Goes Airborne

అమెరికాలో జ‌రిగిన ఘోర రోడ్డు ప్ర‌మాదంలో గుజ‌రాత్‌కు చెందిన ముగ్గురు భార‌తీయ‌ మ‌హిళ‌లు దుర్మ‌ర‌ణం చెందారు. ఆనంద్ జిల్లాకు చెందిన రేఖాబెన్ ప‌టేల్‌, సంగీతబెన్ ప‌టేల్‌, మ‌నీషాబెన్ ప‌టేల్ కారు ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయారు. ద‌క్షిణ క‌రోలినాలోని గ్రీన్‌విల్లే కౌంటీలో ఆ ముగ్గురు ప్ర‌యాణిస్తున్న ఎస్‌యూవీ వాహ‌నం అదుపు త‌ప్పి ప్ర‌మాదానికి గుర‌యింది. 

ఎస్‌యూవీ వాహ‌నం అన్ని లేన్ల‌ను దాటుకుంటూ.. 20 అడుగుల‌ ఎత్తులో గాలిలోకి వెళ్లింద‌ని, ఆ త‌ర్వాత స‌మీపంలో ఉన్న చెట్ల‌ను ఢీకొన్న‌ట్లు గ్రీన్‌విల్లే కౌంటీ పోలీసులు వెల్ల‌డించారు. వాళ్లు ప్ర‌యాణిస్తున్న వాహ‌నం అతి వేగంగా వెళ్తున్న‌ట్లు చీఫ్ డిప్యూటీ క‌రోన‌ర్ మైక్ ఎల్లిస్ తెలిపారు. కారును ఓ చెట్టుపై గుర్తించామ‌ని, అది ముక్క‌లు ముక్క‌లైంద‌ని పోలీసులు వెల్ల‌డించారు. ప్ర‌మాదంలో ఒక‌రు మాత్ర‌మే గాయాల‌తో బ‌య‌ట‌ప‌డి ప్ర‌స్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వాహ‌నంలో ఉన్న డిటెక్ష‌న్ సిస్ట‌మ్ వ‌ల్ల ప్ర‌మాదం జ‌రిగిన ప్రాంతాన్ని కుటుంబ స‌భ్యులు గుర్తించారు.

అతివేగమే ఈ ప్ర‌మాదానికి కార‌ణ‌మ‌ని పోలీసులు తెలిపారు. "వారు హైవేపై ప్ర‌యాణించాల్సిన‌ వేగ ప‌రిమితి కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించిన్నట్లు స్పష్టమ‌వుతోంది" అని డ‌బ్ల్యూఎస్‌పీఏ న్యూస్ ఛానెల్‌కి చీఫ్ డిప్యూటీ కరోనర్ మైక్ ఎల్లిస్ తెలిపారు. ఈ ప్ర‌మాదానికి ఇతర కార్ల ప్రమేయం కూడా లేదని ఆయన స్పష్టం చేశారు.

More Telugu News