Gulbadin Naib: ఢిల్లీ క్యాపిట‌ల్స్‌లోకి ఆఫ్గన్ స్టార్ ఆల్‌రౌండ‌ర్‌

Delhi Capitals sign Gulbadin Naib as replacement for Marsh
  • మిచెల్ మార్ష్‌ స్థానంలో గుల్బాదిన్ నైబ్‌తో డీసీ ఒప్పందం
  • అత‌ని క‌నీస ధ‌ర రూ. 50 ల‌క్ష‌ల‌కు కొనుగోలు చేసిన ఢిల్లీ యాజ‌మాన్యం 
  • గాయం కార‌ణంగా ఐపీఎల్ సీజ‌న్‌ మొత్తానికి దూర‌మైన ఆసీస్ ఆల్‌రౌండ‌ర్ మార్ష్‌ 
గాయం కార‌ణంగా ఐపీఎల్ సీజ‌న్‌ మొత్తానికి దూర‌మైన ఆసీస్ ఆల్‌రౌండ‌ర్ మిచెల్ మార్ష్ స్థానాన్ని ఢిల్లీ క్యాపిట‌ల్స్ భ‌ర్తీ చేసింది. గాయపడిన మార్ష్ స్థానంలో ఆఫ్గనిస్థాన్ ఆల్ రౌండర్ గుల్బాదిన్ నైబ్‌ను ఢిల్లీ జట్టులోకి తీసుకుంది. ఈ విష‌యాన్ని ఢిల్లీ ఫ్రాంచైజీ త‌న అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా తెలియ‌జేసింది. కాగా, మీడియం పేస్ బౌలింగ్‌ ఆల్ రౌండర్ గుల్బాదిన్ ఆఫ్గన్ త‌ర‌ఫున ఇప్ప‌టివ‌ర‌కు 82 వ‌న్డేలు, 62 టీ20లు ఆడాడు. 

అలాగే జాతీయ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్య‌వ‌హ‌రించాడు. అత‌ని క‌నీస ధ‌ర రూ. 50 ల‌క్ష‌ల‌కు ఢిల్లీ యాజ‌మాన్యం కొనుగోలు చేసింది. దీంతో గుల్బాదిన్‌కు తొలిసారి ఐపీఎల్‌లో ఆడేందుకు అవ‌కాశం ద‌క్కింది. ఇక గుల్బాదిన్‌ నైబ్ ఈ ఏడాది జనవరిలో భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఇండోర్, బెంగళూరులో వరుసగా రెండు అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నాడు. 

కాగా, మార్ష్ ఈ సీజన్‌లో డీసీ ఆడిన‌ మొదటి నాలుగు మ్యాచుల‌కు ప్రాతినిధ్యం వ‌హించాడు. కానీ, గాయం కార‌ణంగా అతడు ఏప్రిల్ 12న ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లిపోయాడు. గాయం తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండ‌డంతో టోర్నీ నుంచి త‌ప్పుకున్నాడు. ఇదిలాఉంటే.. ఈ ఐపీఎల్ సీజ‌న్‌ను పేల‌వంగా ప్రారంభించిన డీసీ ఇప్పుడు అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో దూసుకెళ్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు తొమ్మిది మ్యాచులు ఆడిన ఢిల్లీ జ‌ట్టు నాలుగు విజయాలతో పాయింట్ల ప‌ట్టిక‌లో ఆరో స్థానంలో కొన‌సాగుతోంది. కెప్టెన్ రిష‌భ్ పంత్ భీక‌ర‌మైన ఫామ్‌లో ఉండ‌డం ఆ జ‌ట్టుకు బాగా క‌లిసొస్తుంద‌నే చెప్పాలి.
Gulbadin Naib
Delhi Capitals
Mitchell Marsh
IPL 2024
Sports News
Cricket

More Telugu News