Revanth Reddy: బిడ్డ బెయిల్ కోసం బీజేపీకి కేసీఆర్ మద్దతిస్తున్నారు: రేవంత్ రెడ్డి

Revanth Reddy alleges KCR supporting bjp for kavitha bail
  • చేవెళ్లలో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ
  • కారు తుప్పుపట్టి పోయినందుకే కేసీఆర్ బస్సు వేసుకొని యాత్ర చేస్తున్నారని ఎద్దేవా
  • కేసీఆర్ పదేళ్లు ఫామ్ హౌస్ నుంచి బయటకు రాలేదని విమర్శ
తన బిడ్డకు బెయిల్ రావడం కోసం కేసీఆర్ బీజేపీకి మద్దతిస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన రాజేంద్రనగర్‌లో రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... చేవెళ్లలో బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్‌ను బరిలోకి దింపినప్పటికీ వెనుక నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. 

కారు తుప్పుపట్టి పోయినందుకే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు బస్సు యాత్ర అంటూ తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. గత ఏడాది డిసెంబర్ 3న తెలంగాణ ప్రజలు కారును షెడ్డుకు పంపించారని ఎద్దేవా చేశారు. షెడ్డుకు పోయిన కారు తుప్పుపట్టిందని... ఇక అది బయటకు రాదన్నారు.  

కేసీఆర్ దాదాపు పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడని, కానీ ఏనాడూ ఫామ్ హౌస్ నుంచి బయటకు రాలేదన్నారు. అసెంబ్లీకి రాని కేసీఆర్ టీవీలో కూర్చొని తనకు ఇష్టం వచ్చింది మాట్లాడారని విమర్శించారు. అసలు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్లో కేసీఆర్‌ను నమ్మేవారు ఉన్నారా? అని ప్రశ్నించారు. తెలంగాణలో కేసీఆర్, ఢిల్లీలో నరేంద్ర మోదీ పదేళ్లు అధికారంలో ఉన్నారని... కానీ ఇచ్చిన హామీలను మాత్రం నెరవేర్చలేదని విమర్శించారు. 
Revanth Reddy
Congress
BRS
Narendra Modi

More Telugu News