Mallikarjun Kharge: మా మేనిఫెస్టోను చదవండి: ప్రధాని మోదీకి మల్లికార్జున ఖర్గే లేఖ

  • మీ సొంత వ్యక్తులు కొట్టే చప్పట్లను చూసి మోసపోవద్దని మోదీకి హెచ్చరిక
  • మా మేనిఫెస్టోలో చేర్చని అంశాల గురించి మీ సలహాదారులు మీకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని వ్యాఖ్య
  • మా న్యాయపత్రాన్ని వివరించేందుకు వ్యక్తిగత భేటీకి సిద్ధమన్న ఖర్గే
Mallikarjun Kharge writes to PM modi

ప్రధాని నరేంద్ర మోదీకి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బహిరంగ లేఖ రాశారు. సంపద పునఃపంపిణీ, మంగళసూత్రం, వారసత్వ పన్నుపై కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ, బీజేపీ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ప్రధాని మోదీ ఈ పదాలను ఉపయోగించి కాంగ్రెస్‌కు చురకలు అంటిస్తున్నారు. ఈ నేపథ్యంలో చప్పట్లకు మోసపోవద్దని ఖర్గే... మోదీకి లేఖ రాశారు.

"ఇటివల మీ సభలలో మీ భాష విని నేనేమీ ఆశ్చర్యపోలేదు. కానీ మీ సొంత వ్యక్తులు కొట్టే చప్పట్లను చూసి మాత్రం మోసపోవద్దు" అంటూ మోదీని హెచ్చరించారు. మీ మాటలతో నిరాశకు గురైన కోట్లాదిమంది ప్రజల అభిప్రాయాలను మీ దరి చేరనివ్వడం లేదని విమర్శించారు. మా మేనిఫెస్టోలో చేర్చని అంశాల గురించి మీ సలహాదారులు మీకు తప్పుడు సమాచారం ఇస్తున్నారంటూ పేర్కొన్నారు. మా న్యాయపత్రాన్ని వివరించేందుకు మీతో వ్యక్తిగత భేటీకి తాను సిద్ధమేనని... అందుకు సంతోషిస్తానని పేర్కొన్నారు.

అప్పుడు కానీ దేశ ప్రధానిగా మీరు తప్పుడు ప్రకటనలు చేయరని నేను భావిస్తున్నానని ఖర్గే పేర్కొన్నారు. మీ సూట్ బూట్ సర్కార్ కార్పోరేట్ రంగంలోని వ్యక్తుల కోసమే పని చేస్తోందని విమర్శించారు. వారి పన్నులను తగ్గించారని... వారు రిఫండ్స్ పొందుతున్నారన్నారు. మరోవైపు ఉద్యోగులు అధిక మొత్తంలో పన్నులు చెల్లిస్తున్నారన్నారు. పేదలు చివరకు ఉప్పుపై కూడా జీఎస్టీ చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేం పేద, ధనిక వర్గాల గురించి మాట్లాడుతుంటే మీరేమో హిందూ, ముస్లిం గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు.

మీరు మంగళసూత్రం గురించి మాట్లాడుతున్నారని... కానీ మణిపూర్‌లో మహిళలపై ఆకృత్యాలకు కారణమెవరు? అని ప్రశ్నించారు. ఓ వైపు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వారి భార్యాపిల్లలను ఎలా రక్షించాలి? అన్నది మా మేనిఫెస్టో చదివితే తెలుస్తుందన్నారు.

More Telugu News