Mallikarjun Kharge: కాంగ్రెస్‌కు ఓటెయొద్దనుకుంటే కనీసం నా అంత్యక్రియలకైనా రండి: మల్లికార్జున ఖర్గే

Congress chief Mallikarjun Kharges emotional pitch at rally on home turf
  • కలబురగిలో, సీఎం సిద్దరామయ్యతో కలిసి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రచారం
  • తన అల్లుడు, కాంగ్రెస్‌ అభ్యర్థి రాధాకృష్ణకు ఓటేయ్యండంటూ ప్రజలకు విజ్ఞప్తి
  • తాను నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినట్టు భావిస్తే కనీసం తన అంత్యక్రియలకైనా రావాలంటూ భావోద్వేగం
తన కంచుకోట అయిన కలబురగి నియోజకవర్గంలో ప్రచారం సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే భావోద్వేగానికి లోనయ్యారు. కాంగ్రెస్‌ అభ్యర్థికి ఓటెయొద్దనుకున్న వారు కనీసం తాను చేసిన అభివృద్ధి పనులైనా గుర్తు చేసుకోవాలని అన్నారు. తాను నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినట్టు భావిస్తే కనీసం తన అంత్యక్రియలకైనా హాజరు కావాలని అన్నారు. బుధవారం ఆయన, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో కలిసి ప్రచారం నిర్వహించారు.

‘‘మీరు ఈసారి ఓటు మిస్సైతే మీ గుండెల్లో నాకు ఇకపై స్థానం లేదని భావిస్తా’’ అంటూ ఎమోషనల్ అయ్యారు. కలబురగి స్థానం నుంచి కాంగ్రెస్ తరపున ఖర్గే అల్లుడు రాధాకృష్ణ దొడ్డమని బరిలో ఉన్నారు. బీజేపీ తరుపున సిట్టింగ్ ఎంపీ ఉమేశ్ జాదవ్.. తన స్థానం నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 

తాను రాజకీయాలకోసమే పుట్టానని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో పోటీ చేసినా చేయకపోయినా ఊపిరి ఉన్నంత వరకూ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తూనే ఉంటానని చెప్పారు. రాజకీయాల నుంచి రిటైరయ్యే ప్రసక్తే లేదని అన్నారు. రాజకీయనాయకులు పదవులకు దూరమైనా సిద్ధాంతాలను మాత్రం వదులుకోకూడదని సూచించారు. ‘‘నేను సీఎం సిద్దరామయ్యకు ఇదే చెబుతుంటా. సీఎంగా ఎమ్మెల్యేగా రిటైర్ అయినా బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని ఓడించేవరకూ రిటైర్ అవ్వకూడదని అంటాను’’ అని ఖర్గే అన్నారు.
Mallikarjun Kharge
Kalaburagi
Karnataka
Lok Sabha Polls
Congress

More Telugu News