Ayesha Rasham: పాక్ యువతికి భారత్‌లో విజయవంతంగా ఉచిత గుండెమార్పిడి ఆపరేషన్!

Born In India Now In Pakistan Indian Heart Gives Pak Teen New Life
  • ఐశ్వర్యన్ ట్రస్ట్ సాయంతో అయేషా రషన్‌కు ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ
  • చెన్నైలోని ఎమ్‌జీఎమ్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స 
  • ఢిల్లీ నుంచి వచ్చిన గుండెను అమర్చిన వైద్యులు
  • ట్రస్టు, వైద్యులకు ధన్యవాదాలు తెలిపిన పేషెంట్ తల్లి

ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న ఓ పాక్ యువతికి భారత వైద్యులు ప్రాణదానం చేశారు. ఉచితంగా గుండె మార్పిడి ఆపరేషన్ చేసి ఆమెకు కొత్త జీవితం ఇచ్చారు. ఐశ్వర్యన్ ట్రస్టు సహకారంతో చెన్నై ఎమ్‌జీఎమ్ ఆసుపత్రిలో ఈ ఆపరేషన్ జరిగింది. 

గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న పాక్‌ లోని కరాచీకి చెందిన యువతి అయేషా రషన్ గుండె (19) పరిస్థితి ఇటీవల మరింతగా దిగజారింది. చివరకు వైద్యులు ఆమెను ఎక్మోపై ఉంచి చికిత్స ప్రారంభించారు. అయితే, హార్ట్‌ పంప్‌లోని వాల్వ్‌లో లీక్ ఏర్పడటంతో గుండె మార్పిడి ఆపరేషన్ తప్పనిసరైంది. అయితే.. రూ. 35 లక్షలు ఖర్చయ్యే ఈ ఆపరేషన్‌‌‌ భారమంతా ఐశ్వర్యన్ ట్రస్టు, వైద్యులే భరించారు. ఢిల్లీ నుంచి వచ్చిన గుండెను బాలికకు అమర్చి విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేశారు. ప్రస్తుతం తన ఆరోగ్యం మెరుగ్గా ఉందని అయేషా తెలిపింది. తన బిడ్డ ప్రాణాలను కాపాడిన ట్రస్టు, వైద్యులకు అయేషా తల్లి ధన్యవాదాలు తెలిపారు. 

సాధారణంగా అవయవదానానికి సంబంధించి విదేశీయులకు రెండో ప్రాధాన్యం ఉన్నా అయేషాకు మాత్రం సులభంగా గుండె లభించిందని ఇన్‌స్టిట్యూస్ ఆఫ్ హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ డైరెక్టర్ డా. బాలకృష్ణన్, కో డైరెక్టర్ డా. సురేశ్ రావు పేర్కొన్నారు. అయేషా విషయంలో గుండె కోసం మరెవరూ క్లెయిమ్ చేసుకోలేదని తెలిపారు. అవయవదానం, ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్స్‌లో చెన్నై ముందున్న విషయం ఈ ఆపరేషన్‌తో మరోసారి స్పష్టమైందని వైద్యులు వ్యాఖ్యానించారు. దశాబ్దాల పాటు పలు ప్రభుత్వాల కృషి కారణంగా అవయవదానంలో తమిళనాడు ముందున్న విషయం తెలిసిందే. 

అవయవదానం, ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్లకు మరింత అనుకూలమైన విధివిధానాలను రూపొందించాలని ప్రభుత్వాలను వైద్యులు కోరుతున్నారు. ఆపరేషన్‌ల ఖర్చులు భరింపరానివిగా ఉండటంతో అనేక రాష్ట్రాల్లో సద్వినియోగం కావాల్సిన అవయవాలు వృథాగా మారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News