Virender Sehwag: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌ హార్ధిక్ పాండ్యాకు ఫుల్ సపోర్ట్ పలికిన వీరేంద్ర సెహ్వాగ్

Virender Sehwag believes that the all rounder Hardik Pandya should put himself under pressure
  • తనపై అంచనాలతో ఒత్తిడికి గురవుతున్నాడన్న టీమిండియా మాజీ దిగ్గజం
  • గత 2-3 సీజన్లలో రోహిత్ శర్మ కూడా టైటిల్స్ గెలవలేదని గుర్తించుకోవాలని వ్యాఖ్య
  • బ్యాటింగ్‌ ఆర్డర్‌లో పాండ్యా ముందుకు ప్రమోట్ చేయాలని సూచన

ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా, ఇటు వ్యక్తిగత ప్రదర్శనలో విఫలమవుతున్న హార్ధిక్ పాండ్యాపై విమర్శలు వ్యక్తమవుతున్న వేళ టీమిండియా మాజీ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ సమర్థించాడు. ఆల్ రౌండర్ పాండ్యా తనను తాను ఒత్తిడికి గురిచేసుకుంటున్నాడని అభిప్రాయపడ్డాడు. గత 2-3 సీజన్లలో రోహిత్ కూడా ఐపీఎల్ టైటిళ్లను గెలవలేదని గమనించాలని సలహా ఇచ్చాడు. అభిమానుల అంచనాలు ఉన్నప్పటికీ హార్దిక్ ఆటపై శ్రద్ధ పెట్టాలని, ఒత్తిడికి గురికావొద్దని సలహా ఇచ్చాడు.

బౌలర్‌గా, బ్యాటర్‌గా హార్ధిక్ పాండ్యాపై ఒత్తిడి పెరుగుతోందని తాను భావించడంలేదని, తన చుట్టూ ఉన్న అంచనాల అతడిపై ఒత్తిడికి కారణం కావొచ్చని సెహ్వాగ్ విశ్లేషించాడు. ముంబై ఇండియన్స్ గతేడాది కూడా ఇదే స్థితిలో ఉందని, అంతకుముందు కూడా చాలా సార్లు ఇదే పరిస్థితిని ఎదుర్కొందని, ఆ జట్టుకు ఇదేమీ కొత్తకాదని ప్రస్తావించాడు. కెప్టెన్‌గా రోహిత్ కూడా పరుగులు చేయని సందర్భాలు ఉన్నాయని, గత 2-3 సీజన్లలో కెప్టెన్‌గా ట్రోఫీని అందించలేదని సెహ్వాగ్ అన్నాడు. క్రికెట్ అప్‌డేట్స్ అందించే ‘క్రిక్‌బజ్‌’తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.

పాండ్యా ఆర్డర్ ప్రమోట్ చేయాలి...
బ్యాటింగ్‌‌లో హార్దిక్‌ పాండ్యా ఆర్డర్‌కు ముందుకు ప్రమోట్ చేయాలని వీరేంద్ర సెహ్వాగ్ సలహా ఇచ్చాడు. అలా చేస్తే మరిన్ని బంతులు ఆడేందుకు అవకాశం లభిస్తుందని, తద్వారా అతడి ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుందన్నాడు. గుజరాత్ టైటాన్స్ తరపున నంబర్ 4 స్థానంలో బ్యాటింగ్ చేశాడని సెహ్వాగ్ గుర్తుచేశాడు. రాజస్థాన్ రాయల్స్‌పై మ్యాచ్‌లో పవర్‌ప్లేలోనే ముంబై ఇండియన్స్ 3 వికెట్లు కోల్పోయినప్పటికీ పాండ్యా 7వ స్థానంలో బ్యాటింగ్ చేశాడని సెహ్వాగ్ ప్రస్తావించాడు. 

జట్టుగా రాణిస్తేనే విజయాలు అందుకుంటామనే విషయాన్ని ముంబై ఇండియన్స్ గుర్తించాలని, హార్దిక్ బౌలింగ్, బ్యాటింగ్‌లలో రాణిస్తేనే గెలుస్తామనే భావన సరికాదని సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు.

  • Loading...

More Telugu News