Pawan Kalyan: దేశం ఇంత బలంగా ఉంది అంటే ఆర్యవైశ్యుడైన మహాత్మా గాంధీ గారి పోరాటం వల్లే: పవన్ కల్యాణ్

Pawan Kalyan held meeting with various communities
  • ఇవాళ పిఠాపురంలో నామినేషన్ వేసిన పవన్ కల్యాణ్
  • అనంతరం వివిధ సామాజిక వర్గాల ప్రతినిధులతో భేటీ
  • టీడీపీ ఎస్సీ సెల్ నేతలతో సమావేశం
  • అనంతరం ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులతో భేటీ
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం వివిధ సామాజిక వర్గాల వారితో సమావేశం అయ్యారు. పిఠాపురం నియోజకవర్గ ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులతో భేటీ సందర్భంగా పవన్ మాట్లాడుతూ... దేశం ఇంత బలంగా ఉంది అంటే ఆర్యవైశ్యుడైన మహాత్మా గాంధీ పోరాటం వల్లేనని అన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది అంటే అది ఆర్యవైశ్యుడైన పొట్టి శ్రీరాములు త్యాగఫలితమేనని కీర్తించారు. మీ బలం మీరు తెలుసుకోవాలి అని ఆర్యవైశ్యులను ఉద్దేశించి సూచించారు. 

"ఒక రోజున రైలు నుంచి మహాత్మా గాంధీని గెంటేస్తే ఆయన మన దేశం నుంచి బ్రిటీష్ వారిని గెంటేశారు. ఆర్యవైశ్యుల తాలూకు బలం అలాంటిది. మీరు భయపడకూదదు. పెనుగొండలో వాసవి కన్యకాపరమేశ్వరి దేవి ఆలయ ప్రారంభోత్సవానికి పిలిస్తే వెళ్లాను. ఆర్యవైశ్యులతో నాకు చిన్నప్పటి నుంచి అనుబంధం ఉంది. నా మిత్రుడు రమేశ్ ఇచ్చిన పుస్తకాలు చదివి నేను జ్ఞానం సంపాదించుకున్నాను. రమేశ్ ఒక వైశ్యుడు. 

ప్రజాసేవ కోసం పాటుపడే వారిలో ఆర్యవైశ్యులు ముందుంటారు. మీరు సమాజం కోసం చేసే సేవలు నాకు తెలుసు. ఆర్యవైశ్యులపై దాడులు జరగకుండా, వారికి రక్షణ కల్పించేందుకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ తరహా చట్టాలు తీసుకురావాలి అనుకుంటున్నాను. మీరు ఆత్మగౌరవాన్ని కోరుకుంటారని నాకు తెలుసు. వాసవి కన్యకాపరమేశ్వరి దేవి ఆత్మగౌరవం కోసం ఆత్మబలిదానం చేసుకుంది. ఆర్యవైశ్యులకు అలాంటి ఆత్మగౌరవాన్ని తీసుకువచ్చేందుకు పాటుపడతాను. 

ఇంతకుముందు భీమవరం వెళ్లినప్పుడు... మావూళ్లమ్మ తల్లికి సేవ చేసుకునే భాగ్యం కల్పించాలని ఆర్యవైశ్యులు కోరారు. అంతేకాదు, అక్కడి శ్రీపాద వల్లభ స్వామి వారి సేవలో భాగస్వామ్యం కల్పించాలని కూడా విజ్ఞప్తి చేశారు. మన ప్రభుత్వం వచ్చాక మీ కోరికను నెరవేర్చేలా చూస్తాను" అని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.

వర్మను కొనియాడిన పవన్ 

పవన్ అంతకుముందు టీడీపీ ఎస్సీ సెల్ నేతలతోనూ సమావేశమయ్యారు. పిఠాపురంలో తన ఇంటి నిర్మాణం పూర్తయ్యాక... ప్రతి ఒక్కరూ వచ్చి తనను కలిసి సమస్యలు చెప్పుకునే ఏర్పాట్లు చేస్తానని పవన్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటానని టీడీపీ ఎస్సీ సెల్ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 

పిఠాపురం టీడీపీ ఇన్చార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ ఇక్కడ కార్యకర్తలను తయారు చేయలేదు... బలమైన నేతలను తయారు చేశారని కొనియాడారు. నియోజకవర్గ అభివృద్ధిలో మీ వంటి నాయకుల సేవలను తప్పకుండా ఉపయోగించుకుంటానని టీడీపీ ఎస్సీ సెల్ నేతలకు స్పష్టం చేశారు. 

భారత రాజ్యాంగ రూపకల్పనలో 11 మంది మహిళలు పాలుపంచుకుంటే, అందులో ఒక దళిత మహిళ కూడా ఉందని, అప్పటి నుంచే దళిత మహిళలు చైతన్యవంతులుగా ఉన్నారని పవన్ కల్యాణ్ వివరించారు. నేను జాషువా విశ్వనరుడిని అర్థం చేసుకున్నవాడ్ని... తప్పకుండా దళితులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. 

ఎస్వీఎస్ఎన్ వర్మ ఎమ్మెల్యే అభ్యర్థి కాకపోయినా ఆయనకు గౌరవం ఇచ్చే బాధ్యత తనది అని పవన్ స్పష్టం చేశారు. ఆయనను చట్టసభల్లో కూర్చోబెట్టే బాధ్యత తాను తీసుకుంటానని వెల్లడించారు.
Pawan Kalyan
Pithapuram
Janasena
TDP

More Telugu News