indonesia: అగ్నిపర్వతం వద్ద ఫొటో దిగుతూ జారిపడి మహిళ మృతి

chinese woman posing for photo dies after falling into volcano in indonesia
  • సూర్యోదయం ఫొటో కోసం వోల్కనో అంచున నిలబడ్డ చైనా టూరిస్టు
  • డ్రెస్ కాళ్లకు తగలడంతో ప్రమాదశాత్తూ 246 అడుగుల బిలంలో పడిన వైనం
  • ఇండోనేసియాలోని ఇజెన్ అగ్నిపర్వత పార్క్ లో ఘటన

ఇండోనేసియాలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఇజెన్ అగ్నిపర్వత సమూహ పార్క్ వద్ద విషాదం చోటుచేసుకుంది. అగ్నిపర్వతాల సందర్శనకు వచ్చిన ఓ చైనా మహిళ ఫొటో తీసుకొనే క్రమంలో ప్రమాదవశాత్తూ కాలుజారి అగ్నిపర్వత బిలంలో పడి మృతిచెందింది. న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం హావాంగ్ లిహాంగ్ అనే మహిళ తన భర్తతో కలసి అగ్నిపర్వతం విరజిమ్మే నీలి మంటలను తిలకించేందుకు వచ్చింది.

సూర్యోదయాన్ని తిలకించేందుకు అగ్నిపర్వత బిలం అంచుకు ఆ దంపతులు చేరుకున్నారని పోలీసులు తెలిపారు. ఫొటోలు తీసుకొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని పలుమార్లు హెచ్చరించడంతో తొలుత వారిద్దరూ బిలానికి కాస్త దూరంగానే నిలబడ్డారని టూర్ గైడ్ అధికారులకు చెప్పాడు. అయితే ఆ తర్వాత ఆ మహిళ సెల్ఫీ కోసం వెనక్కి నడిచే క్రమంలో ఆమె డ్రెస్ కాళ్లకు తగిలి సుమారు 246 అడుగుల (75 మీటర్లు) ఎత్తు నుంచి బిలంలోకి పడి మృతిచెందిందని న్యూయార్క్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది. ఆమె మృతదేహాన్ని బిలంలోంచి బయటకు తీసుకొచ్చేందుకు రెండు గంటల సమయం పట్టినట్లు అధికారులు తెలిపారు.

ఇజెన్ అగ్నిపర్వతం విరజిమ్మే నీలి మంటకు ఎంతో పేరుగాంచింది. అగ్నిపర్వతంలోని గంధకం వాయువులు (సల్ఫ్యూరిక్ గ్యాసెస్) నిరంతరం మండుతుండటం వల్ల అది నీలి మంటను విరజిమ్ముతూ ఉంటుంది. ద ఇండిపెండెంట్ కథనం ప్రకారం 2018లో ఇజెన్ అగ్నిపర్వతం విషవాయువులను విడుదల చేయడం వల్ల 30 మంది ఆసుపత్రులపాలయ్యారు. దీంతో సమీప ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు బలవంతంగా ఇళ్ల నుంచి ఖాళీ చేయించారు. ఈ అగ్నిపర్వతం తరచూ స్వల్ప మొత్తాల్లో విష వాయువులను విడుదల చేస్తున్నా ఆ ప్రాంతం ప్రజల సందర్శన కోసం తెరిచే ఉంటుంది.

ఇండోనేసియాలో సుమారు 130 యాక్టివ్ అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఇండోనేసియాలోని ఉత్తర సులవేసీలో ఉన్న మౌంట్ రువాంగ్ అగ్నిపర్వతం ఈ నెల 16న బద్దలవడంతో వేలాది మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి వెళ్లారు.  ఆ అగ్నిపర్వతం భారీగా లావా, బూడిదను 1,312 అడుగుల ఎత్తు వరకు విరజిమ్మిందని ఆ దేశ అగ్నిపర్వత ఏజెన్సీ తెలిపింది.

  • Loading...

More Telugu News